పెట్రో ధరల పాపం.. ఎవరిది ఎంతెంత అంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రో ధరల పాపం.. ఎవరిది ఎంతెంత అంటే..

April 2, 2018

సోమవారం ఇంధన ధరలు భగ్గుమన్నాయి. పెట్రోల్ ధర  ఢిల్లీలో నాలుగేళ్ల గరిష్టానికి ఎగబాకింది. లీటరు ధర ఏకంగా ముంబైలో రూ. 81.69కి చేరింది. డీజిల్ ధర కూడా నేనేం తక్కువ తిన్నానా అన్నట్లు రూ. 69.81కి చేరింది. సాధారణంగా ధరలు పెరిగినప్పుడల్లా అంతర్జాతీయ విపణిలో పెరిగాయి, రూపాయి డాలరు మారకంలో తేడాల వల్ల పెంచుతాం అని చెప్పినట్లే ఇప్పుడూ చెప్పారు. అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగిన మాట వాస్తవమేగాని, అక్కడ ధరలు తగ్గినప్పుడు ఇక్కడ మాత్రం తగ్గకపోవడంతో పలు అనుమానాలు వస్తున్నాయి.

పన్నుల మోత తగ్గాలి..

Related image

2014 నుంచి 2016 మధ్య వరకు అంతర్జాతీయ మార్కట్లో ధరలు నిలకడగా ఉండేవి. చాలాసార్లు తగ్గాయి కూడా. అయితే అప్పుడు కూడా మన దేశంలో ధరలను తగ్గించలేదు. రోజువారీగా సవరణలతో దారుణంగా పెంచేస్తున్నారు. రోజు 10 పైసలు, 5 పైసలు అన్నట్లు చిన్నగా కనిపించిన ఆ లెక్కలన్నీ కలిపి పది, ఇరవై రూపాయలకు చేరిపోతున్నాయి. గత ఏడాది జూలై 1 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 47 శాతం పెరిగాయి. అయితే ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. గతంలో భారీగా పడిపోయిన ధరలు ఈ మేరకు పెరిగినా పెద్ద తేడాలేమీ రాలేదు. అయితే మనదేశంలో పన్నులు మోత భయంకరంగా ఉండండంతో ధరలు కూడా కాలిపోతున్నాయి.

దాదాపు 50 శాతం పన్నే..

Related image

మనం చెల్లించే పెట్రోల్ ధరలో 48.2 శాతం కేంద్రానికి ఎక్సైజ్ పన్నురూపంలో, రాష్ట్రాలకు వ్యాట్, ఇతర స్థానిక పన్నుల రూపంలో వెళ్తోంది. డీజిల్ విషయంలో అయితే ఇది 38.9 శాతం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య ఎక్సైజ్ సుంకాన్ని 9 సార్లు పెంచాడు. గత ఏడాది అక్టోబర్లో మాత్రమే లీటరుపై రూ. 2 తగ్గించాడు. ఈ పెంపులతో పెట్రోల్‌పై రూ. 11.77, డీజిల్‌పై రూ. 13.47 అదనపు భారం పడింది. ఫలితంగా 2014-15లో రూ. 99 వేల కోట్లుగా ఉన్న కేంద్ర ఎక్సైజ్ ఆదాయం2016-17లో రూ. 2,42,000 వేలకు కోట్లు దాటిపోయింది. 9సార్లు సుంకాన్ని పెంచేసిన కేంద్రం.. ధరల పాపమంతా రాష్ట్రాలదే అని, అవి పన్నులు తగ్గించకపోవడంతో ధరలు మండుతున్నాయని ఆరోపిస్తోంది. ధరలు తగ్గిస్తే తమ ఆదాయం భారీగా పడిపోతుందని కేంద్రమే తగ్గించుకోవాలని రాష్ట్రాలు అంటున్నాయి. మధ్యలో వినియోగదారుడి పరిస్థిడి అడకత్తెరలో పోకచెక్కగా మారిపోయింది.

జీఎస్టీ పరిధిలోకి తెస్తే..

Image result for tax on petrol gst

చమురు ధరలను వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తెస్తే పన్నులు స్థిరంగా ఉండడంతో ప్రజలకు మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నాయి. అయితే దీనివల్ల తమ ఖజానాకు ఆదాయం తగ్గుతుందని ప్రభుత్వాలు భయపడుతూ ప్రజలను ధరోత్పాతంతో చావగొడుతున్నాయి..