రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్నాయి. దీంతో అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పట్లేదు. మన దేశంలో ఇంకా ధరలు పెంచకున్నా, పక్కనున్న శ్రీలంకలో మాత్రం భారీగా పెంచారు. ఎంతంటే.. ఏకంగా డీజిల్‌పై రూ. 75, పెట్రోల్‌పై రూ. 50 లను పెంచారు. డాలర్‌తో శ్రీలంక మారక విలువ భారీగా పడిపోవడమే ఇందుకు కారణంగా చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. పెరిగిన ధరల ప్రకారం పెట్రోల్ రేటు రూ. 254, డీజిల్ రేటు రూ. 214 లుగా ఉంది. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు రాదనీ, అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని ఆ కంపెనీ ఎమ్డీ మనోజ్ గుప్తా తెలిపారు. కాగా, మరో ప్రధాన కంపెనీ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ మాత్రం ధరలు పెంచకపోవడం గమనార్హం.