Full analysis on Central Government Agneepath Scheme
mictv telugu

‘అగ్నిపథ్’ స్కీం ఉద్దేశం, అనుకూల, ప్రతికూలతలు.. వివరంగా

June 17, 2022

Full analysis on Central Government Agneepath Scheme

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’. దీనిపై దేశ వ్యాప్తంగా కొందరు అభ్యర్దులు ఆందోళన చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. దీంతో చాలా మంది ఒక్కసారిగా ఈ విషయంపై దృష్టి సారించారు. అసలేంటీ ఈ విధానం అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాగా, అగ్నిపథ్‌‌ని మరో మాటలో టూర్ ఆఫ్ డ్యూటీ అని కూడా అంటారు. దీనిని అర్ధం చేసుకోవాలంటే ఆర్మీలో నియామకాలు చేపట్టే 5 విభాగాల గురించి తెలుసుకోవాలి.

1. పర్మినెంట్ కమిషన్

2. షార్ట్ సర్వీస్ కమిషన్

3. టెరిటోరియల్ ఆర్మీ

4. ఇన్‌వర్స్ ఇండెక్షన్

5. టూర్ ఆఫ్ డ్యూటీ. ఈ ఐదో దానిని కేంద్రం కొత్తగా ప్రకటించింది.

1. పర్మినెంట్ కమిషన్ 

దీనర్ధం సర్వీస్ మొత్తం ఆర్మీలో ఉంటుంది. అయితే వేర్వేరు ర్యాంకులకు వేర్వేరుగా పదవీ కాలం ఉంటుంది. జవాన్ అయితే 38 నుంచి 40 సంవత్సరాలు వచ్చేసరికి రిటైర్ కావాల్సి ఉంటుంది. ఆఫీసర్ అయితే 54 లేదా 55 ఏళ్లు వచ్చేసరికి రిటైర్ కావాల్సి ఉంటుంది. కల్నల్ ఆపైస్థాయి ర్యాంకు అయితే 60 ఏళ్లకు రిటైర్ అవుతారు.

2. షార్ట్ సర్వీస్ కమిషన్ 

ఈ విభాగంలో ఆర్మీ సర్వీసులో చేరిన పది నుంచి పదిహేను సంవత్సరాలకు రిటైర్ అవుతారు. వీరికి సర్వీసు కాలంలో జీతభత్యాలతో పాటు రేషన్, సబ్సిడీ వంటి సౌకర్యాలు అందుతాయి. రిటైర్ అయిన తర్వాత పింఛను సౌకర్యం ఉంటుంది.

3. టెరిటోరియల్ ఆర్మీ 

వీరికి ఆర్మీ శిక్షణ ఇస్తుంది. వీరు రిజర్వ్‌లో ఉంటారు. అంటే యుద్ధం సంభవిస్తే బ్యాకప్‌గా ఉపయోగపడతారనే భావనతో రిజర్వ్‌లో ఉంచుతారు. అంటే క్రికెట్‌లో రిజర్వ్ బెంచ్‌లాగా అన్నమాట. అంటే ఒక రకంగా సబ్‌స్టిట్యూట్ ఆటగాడిలా సబ్‌స్టిట్యూట్ ఆర్మీ అన్నమాట. ఈ విధానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో నియమించింది. అంటే ధోనీ సరిహద్దుల్లో పహారా కాయడం వంటివి చేయడు. ఒకవేళ యుద్ధం వస్తే పాల్గొంటాడు. అందుకు అవసరమైన శిక్షణ ధోనీకి ఇప్పటికే ఇచ్చేశారు. టెరిటోరియల్ విభాగంలో ఉన్న వారికి జీతభత్యాలు ఇవ్వరు. యుద్ధ సమయంలో మాత్రమే ఇస్తారు.

4. ఇన్‌వర్స్ ఇండెక్షన్ 

ఈ విధానంలో పారామిలిటరీ విభాగాల్లో పనిచేస్తున్న వారిని ప్రొబేషన్ మీద ఆర్మీ కొంత సమయం వరకు తీసుకుంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వారిని వారి డిపార్ట్ మెంటులోకి పంపేస్తారు. అంటే బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ వంటి విభాగాల్లో పనిచేసే ఉత్తమ జవాన్లను ఇలా తీసుకుంటారు. అలాగే యుద్ధ సమయంలో అవసరమవుతారని ఎన్‌సీసీ విద్యార్ధులను కూడా సిద్ధంగా ఉంచుతారు.

5. టూర్ ఆఫ్ డ్యూటీ 

ఈ విధానం గతంలో 3 ఏళ్లకు ప్రతిపాదించగా, తాజాగా దానిని 4 ఏళ్లకు పెంచారు. ఈ స్కీంను దివంగత సీడీఎస్ చైర్మన్ జనరల్ బిపిన్ రావత్, ప్రధాని నరేంద్ర మోదీలు కలిసి రూపొందించారు. ఇప్పుడు వివాదం ఈ టూర్ ఆఫ్ డ్యూటీపై చెలరేగింది. ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒకరకంగా చెప్పాలంటే ఈ టూర్ ఆఫ్ డ్యూటీలో భాగంగా కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీం ఒక ఇంటర్న్‌షిప్ లాంటిది. ఈ విధానం వల్ల ఆర్మీలో ఎల్లప్పుడూ నవ యువకులు ఉంటారు. నాలుగేళ్ల ఉద్యోగ కాలంలో మొదటి ఏడాది వీరికి కఠిన సైనిక శిక్షణ ఉంటుంది. దాని తర్వాత మూడేళ్లు విధులు నిర్వర్తించాలి. అంతా రెగ్యులర్ జవాన్లకు ఇచ్చే శిక్షణ, విధులు ఉంటాయి. ఈ రకంగా పనిచేసి బయటికొచ్చిన వ్యక్తి వేరే వేరే రంగాల్లో, ఉద్యోగాల్లో చేరారనుకుందాం. ఆర్మీలో పనిచేసి వచ్చారు కాబట్టి క్రమశిక్షణ, నిజాయితీ, శ్రమ చేయడానికి వెనుకాడరు. దేశభక్తి, జాతీయవాదం వంటి భావనలు ఉంటాయి కాబట్టి పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. వీరిని చూసి మిగతా వారు కూడా నేర్చుకుంటారు. తద్వారా సమాజం కూడా మెరుగవుతుంది. అయితే టూర్ ఆఫ్ డ్యూటీలో చేరేవాళ్లు కుర్రవాళ్లు, అనుభవం ఉండదు. ఈ సమస్యను అధిగమించడానికే ఆర్మీలో మొత్తం కాకుండా కొంత శాతం వరకు ఈ విధానంలో భర్తీ చేయడం జరుగుతోంది. అంటే అటు అనుభవం ఉన్నవారు, ఇటు యువరక్తంతో ఉరకలెత్తేవారు ఇద్దరూ కలిస్తే ఆర్మీ మరింత పటిష్టమవుతుందని వారి భావన.

నిధుల మిగులుబాటు 

ఇంకో వివాదం పింఛను విషయంలో వస్తుంది. మనదేశ రక్షణ రంగ బడ్జెట్‌లో దాదాపు 60 శాతం జీతభత్యాలు, పింఛన్ల రూపంలో ఖర్చవుతున్నాయి. సైన్య ఆధునికీకరణ కోసం మిగిలిన నిధులు చాలడం లేదు. ఈ అగ్నిపథ్ విధానంలో నియామకమైన జావానుపై ఒక పర్మినెంట్ జవాన్‌పై ఖర్చు చేసే మొత్తంలో పదో వంతు మాత్రమే ఖర్చవుతుంది. దాంతో పెద్ద ఎత్తున నిధులు మిగులుతాయి. దీంతో అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీ, క్షిపణులు వంటివి సమకూర్చుకోవచ్చు. ఇంకోవైపు యుద్ధం అంటే గతంలోలాగా సైన్యం ఎక్కువ ఉన్న వారిదే విజయం లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. వంద మంది సైనికులను కూడా టెక్నాలజీ సహాయంలో కేవలం ఒకరిద్దరు మాత్రమే చంపేయవచ్చు.

టెక్నాలజీ మెరుగుదల 

ఉదాహరణకి చిన్న దేశమైన ఉక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంలో ఒకటైన రష్యాను నాలుగు నెలలుగా నిలువరించిందంటే కారణం టెక్నాలజీయే. కేవలం కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుందనుకున్న యుద్ధం ఇప్పటికీ అయిపోలేదంటే టెక్నాలజీ పాత్ర అర్ధం చేసుకోవచ్చు. అంతకు ముందు ఆర్మేనియా, అజర్ బైజాన్ యుద్ధంలో కూడా ఎక్కువ సంఖ్యలో సైన్యం ఉన్న ఆర్మేనియా ఓడిపోయింది. కారణం అజర్ బైజాన్ డ్రోన్ల ద్వారా ఎటాక్ చేయడం. రోజురోజుకీ యుద్ధం కొత్త మలుపులు తీసుకుంటోంది. సైబర్ దాడులు, డ్రోన్లతో బాంబులు వేయడం వంటి కొత్త పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. దాంతో పాటు మనం కూడా పోటీపడకపోతే చైనా లాంటి బలమైన సరిహద్దు దేశాలు మనల్ని తేలిగ్గా ఓడించగలుగుతాయి.

ప్రతికూలతలు

ముఖ్యంగా ఈ విషయంలో నెగిటివ్ ఏదైనా ఉందంటే అది నాలుగేళ్ల సర్వీసు తర్వాత ఉపాధి ఎలా అనే. నాలుగేళ్లు పనిచేయించుకొని పింఛను ఇవ్వలేమని అంటున్నారు. అంటే మరి రాజకీయ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఒక్కసారి గెలిస్తే వారికి జీవితాంతం పింఛను, ఇతర సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.

హనీట్రాప్ 

ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి విభాగాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే ఆఫీసర్లను శత్రు దేశాలు హనీ ట్రాప్‌లోకి లాగి దేశ రక్షణ రహస్యాలను తీసుకుంటున్నాయి. మరి నాలుగేళ్లు పనిచేసి బయటికొచ్చిన పెళ్లికాని అబ్బాయిల పరిస్థితి ఏంటి? వీరు ఇంకా ఈజీగా హనీట్రాప్‌కు గురవుతారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు నాలుగేళ్ల సర్వీసు తర్వాత తుపాకీ కాల్చడం వంటివి నేర్చుకొని వస్తాడు కాబట్టి, అసాంఘిక శక్తులు వీరిని వాడుకోరని గ్యారంటీ ఏంటి? ఉపాధి లేని వీరు చాలా సులువుగా ఇలాంటి వాటి పట్ల ఆకర్శితులు అవుతారు. దీనిని నిరోధించడానికి ఏం చేయబోతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పటికే ఆర్మీ నియామకాలు జరిపినప్పుడు ఫిజికల్, మెడికల్ టెస్టులకు హాజరై రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల పరిస్థితిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలి. తక్షణ నిరసన, హింస జరిగిందంటే ఈ అభ్యర్ధులే కారణం, వారి విషయంలో అనుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ముగింపు 

నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసి బయటికొచ్చిన మాజీ జవాన్లకు కాలేజీ సీట్లలో, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. బ్యాంకు, రైల్వే, పోలీసు, పారామిలిటరీ వంటి వాటిలో ప్రత్యేక కేటగిరీగా గుర్తించి నియామకాలు చేపట్టాలి. వ్యాపారం చేసేవాళ్లకి తక్కువ వడ్డీకి రుణాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇలాంటి ప్రతిపాదనలు ఏమైనా ప్రభుత్వం నుంచి వస్తే అభ్యర్ధులు కొంచెమైనా శాంతిస్తారేమో చూడాలి. కాగా, ఈ టూర్ ఆఫ్ డ్యూటీ విధానం ఇప్పటికే చైనాలో అమల్లో ఉంది.

సేకరణ, రచన : జాటావత్ రవీందర్ నాయక్, మైక్ టీవీ