Full Story on Shalini - Johnny's Love Rajanna Sircilla
mictv telugu

సిరిసిల్ల షాలిని కిడ్నాప్ స్టోరీ.. సినిమాను తలపించే ట్విస్టులతో పూర్తి కథనం

December 20, 2022

Full Story on Shalini - Johnny's Love

సిరిసిల్ల జిల్లా వేముల వాడ నియోజకవర్గంలో మంగళవారం తెల్లవారుఝాము 5 గంటలకు యువతి షాలిని కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యి నిందితులను సాయంత్రం లోగా పట్టుకోవాలని ఆదేశించడంతో అందరికీ ఇటీవల ఆదిబట్లలో జరిగిన వైశాలి ఘటన గుర్తుకు వచ్చింది. కానీ, ఇంతలో కిడ్నాపయిన యువతి షాలిని పెళ్లి చేసుకుని ట్విస్ట్ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు‌ మొదలైంది. ఈ కిడ్నాప్ వెనుక ఏం జరిగింది? కిడ్నాప్ కి దారితీసిన పరిస్థితులపై పూర్తి కథనం ఇది.

1. నేపథ్యం

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామం వీరి స్వస్థలం. కటుకూరి జ్ఞానేశ్వర్ అలియాస్ జానీ అనే దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన గోలి షాలినిలు ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే గతేడాది జానీ తన మైనర్ అయిన షాలినిని తీసుకెళ్లి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. దీంతో షాలిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జానీని జైలుకు పంపారు. పది నెలలు జైల్లో గడిపిన జానీ ఇటీవలే రిలీజై బయటికి వచ్చాడు.

2. షాలినికి ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు

తమ కూతురు ప్రేమ పేరుతో.. వాడుక భాషలో చెప్పాలంటే దళిత యువకునితో లేచిపోవడాన్ని తట్టుకోలేకపోయిన షాలిని పేరెంట్స్ ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఓ యువకుడితో సోమవారం నిశ్చితార్ధం కూడా జరిపించారు. దాంతో పాటు షాలినికి మైనార్టీ తీరిపోవడంతో త్వరలో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కానీ దీన్ని అవకాశంగా భావించిన షాలిని మళ్లీ తన ప్రేమికుడిని లైన్లో పెట్టింది.

3. కిడ్నాప్ వెనుక షాలిని స్కెచ్

తనకు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించిన విషయాన్ని షాలిని తన ప్రియుడు జానీకి చేరవేసింది. తనను వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరడంతో అప్రమత్తమైన జానీ.. సినిమా స్టైల్లో కారులో నలుగురిని వెంటేసుకుని బయల్దేరాడు. మంగళవారం తెల్లవారుజామున సమీపంలోని ఆంజనేయుడి గుడి నుంచి తండ్రితో కలిసి వస్తున్న షాలినిని కారులో కిడ్నాప్ చేశాడు. షాలిని తండ్రి గోలి చంద్రయ్య అడ్డుపడ్డా ఆయనను తోసేసి షాలినితో పరారయ్యాడు.

కిడ్నాప్ సమయంలో షాలిని ప్రవర్తన ఏమాత్రం అనుమానంగా లేకపోవడంతో నిజంగా కిడ్నాప్ అయ్యిందని అంతా భావించారు. ఇదంతా సమీపంలో ఉన్న సీసీకెమెరాల్లో రికార్డవగా, చంద్రయ్య వెళ్లి కిడ్నాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీపై అనుమానం ఉందని అందులో పేర్కొన్నాడు. అటు కిడ్నాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సాయంత్రంలోగా నిందితులను అరెస్ట్ చేసి యువతిని విడిపించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలర్టయిన పోలీస్ విభాగం వీరికోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపును ముమ్మరం చేశారు.

ట్విస్ట్ ఇచ్చిన ప్రేమజంట

పోలీసుల గాలింపు కొనసాగుతుండగా, జాన్ – షాలినిల జంట ఓ గుడిలో పెళ్లి చేసుకొని ఆ వీడియోను, ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. అందులో షాలిని తాను ఇష్టపూర్వకంగానే జానీని పెళ్లి చేసుకున్నానని, గత నాలుగేళ్ల ప్రేమకథని, కిడ్నాప్ వెనుక తన పాత్రను వెల్లడించింది. తనకు పేరెంట్స్ వేరే యువకునితో పెళ్లి చేస్తున్నారని, వచ్చి తీసుకెళ్లమని చెప్పానన్నారు. అయితే కిడ్నాప్ సమయంలో జానీ ముసుగు వేసుకొని ఉండడంతో గుర్తుపట్టలేకపోయానని, కారులో ఎక్కించిన తర్వాత వచ్చింది తన ప్రియుడేనని తెలిసిందని వివరించింది.

గతేడాదే తాము పెళ్లి చేసుకున్నామని, తన అమ్మానాన్న తొందరపడి కేసు వేసి అనవసరంగా జానీని జైల్లో పెట్టించారని వాపోయింది. జానీ దళితుడు కాబట్టి పేరెంట్స్ తమ పెళ్లికి ఒప్పుకోలేదని, వారి నుంచి తమకు ప్రాణభయం ఉంది కాబట్టి ఈ విషయంలో మీడియా, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరింది. తనకు ఈ రోజుతోనే మైనార్టీ తీరిపోయింది కాబట్టి తన పెళ్లి విషయంలో తనదే తుది నిర్ణయమని స్పష్టంగా చెప్పేసింది. దీంతో ఈ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇప్పుడు చట్టపరంగా ఈ జంటకు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, సమాజపరంగా ఈ జంటకు ఇబ్బందులు తప్పవని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

మల్లారెడ్డికి పొగపెడుతున్నారా? అతిచేష్టలే ముంచబోతున్నాయా?

2 నెలల చంటిబిడ్డతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే ..