భారత్ లో చైనా చోరబాటు వెనుక అసలు రహస్యాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఎంత తరుముతున్నా మళ్ళీ మళ్ళీ మన దేశంలోకి రావడానికి కారణం ఓ ఫంగస్ అని తేలింది. పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యునికేషన్ ఈ విషయాన్ని ఓ నివేదికలో చెప్పింది. పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్‌ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ అని పిలుస్తారు. చాలా అరుదుగా దొరికే ఈ ఫంగస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. పసుపు, కాషాయ వర్ణంలో సన్నటి పోగులా ఉం డే వీటిని సూపర్ మష్రూమ్స్‌గా పిలుస్తారు. ఈ మష్రూమ్స్ చాలా ఖరీదుట కూడా.ఎంత అంటే బంగారం కంటే కూడా వీటి ధర ఎక్కువట. 10 గ్రాముల కార్డిసెప్స్ ధర సుమారు 700 డాలర్లు అంటే 56 వేలు అన్నమాట. నాణ్యమైన ఫంగస్ అయితే కిలో లక్షల్లోనే పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లోని హిమాలయల్లో, చైనా నైరుతిలోని క్వింగై – టిబెట్ లాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఈ కార్డిసెప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. 2022 నివేదిక ప్రకారం వీటి అంతర్జాతీయ మార్కెట్ విలువ 1072.50 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనాదే అగ్రస్థానం. అయితే, అత్యధికంగా ఉత్పత్తయ్యే క్వింగై ప్రాంతంలో గత రెండేళ్ళ నుంచి వీటి సాగు క్షీణించింది. మరోవైపు పదేళ్ళల్లో కార్డిసెప్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందుకే వీటి కోసం అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా సైనికులు చొరబడినట్లు ఐపీసీఎస్సీ నివేదిక తెలిపింది.