ముందస్తు ముచ్చట లేనట్టే..! - MicTv.in - Telugu News
mictv telugu

ముందస్తు ముచ్చట లేనట్టే..!

May 25, 2017

ముందస్తు ఎన్నికలపై పొలిటికల్ సర్కిల్ లో తెగ డిస్కషన్ నడిచింది.వచ్చే ఏడాదిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల ముందే ఎన్నికలు వెళ్తారని టాక్ కోడైకూసింది. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఫోకస్ చేసినట్టుగా జమిలి ఎన్నికలు జరిగితే ముందస్తు కు వెళ్లొచ్చని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇదంతా ఒట్టి ముచ్చటేనని సీఎం కేసీఆర్ బుధవారం ప్రెస్ మీట్ లో తేల్చిచెప్పారు. ముందస్తు ముచ్చట గిచ్చట అస్సలు లేదు.ఐదేళ్లు పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్తామని కుండబద్దలు కొట్టారు.
ఎక్కడ చూసినా ఈ మధ్య ఊ అంటే ముందస్తు ముచ్చట్లే. అధికార, విపక్ష నేతల్లో అదే చర్చ. ఎవరికి వారు పొలిటికల్ గ్రౌండ్ వర్క్ మొదలెట్టేశారు. ముందస్తు ఎప్పుడొచ్చినా బీ రెడీ అన్నట్టు ఎక్సర్ సైజ్ చేశారు. పైకి ఎవరూ చెప్పకపోయినా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఆశావహులు నియోజకవర్గాలపై నజర్ పెట్టారు.జనానికి ఎప్పుడు టచ్ లో ఉంటూ అలా మొయింటైన్ చేస్తూ వస్తున్నారు.
ప్రధాన పార్టీలన్నీ సభలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలో జోష్‌ నింపుతున్నాయి. సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు అన్ని పార్టీలు గ్రామాల బాటపట్టాయి. గ్రామాల్లో విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించాయి. వచ్చే ఏడాదిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండడంతో అందుకు సంసిద్ధం అయ్యేందుకు పార్టీలు పని మొదలు పెట్టాయి. మూడేళ్లగా స్తబ్ధుగా ఉన్నవారిలో సైతం కదలిక రావడంతో రాజకీయం వేడెక్కింది.
ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇటీవల వరుసగా పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ ప్రజలతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నాయి. మొన్న అధికార పార్టీ వరంగల్‌లో భారీ సభ నిర్వహించింది. అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ తాండూరులో భారీ సభ పెట్టింది.అదేవిధంగా బీజేపీ సైతం పార్లమెంట్‌ నియోజకవర్గాల సదస్సులు నిర్వహించి కేడర్ లో ఉత్సాహం నింపుతోంది. అందులో భాగంగా ఇటీవల చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సదస్సును మొయినాబాద్‌ మండలంలో నిర్వహించింది.తాండూరులో ప్రజాపోరును నిర్వహించింది.
జమిలి ఎన్నికల నేపథ్యం…
లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనను ప్రధాని మోదీ ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. చట్టపరంగా కొన్ని మార్పులు చేయడంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకుంటే లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు సులభమేనని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్పాయి. జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరుపడం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి ఒకే రోజున తీరాల్సి ఉంటుంది.
భారతదేశం 1950లో రిపబ్లిక్ మారిన తర్వాత 1952లో తొలిసారి దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. దేశంలో జమిలి ఎన్నికల ప్రక్రియ తొలి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో మొదలైంది. నాలుగో లోక్‌సభకు ఆటంకం కలిగేంత వరకూ జమిలి ఎన్నికలు కొనసాగాయి. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది. కాలక్రమంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువు లోక్‌సభ గడువు కలువడంతో లోక్‌సభతోపాటే అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2014లో ఏపీ, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఇలాగే ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. మోదీ ఫోకస్ తో అంతా జమిలి ఎన్నికలు పక్కా అనుకున్నారు. అదీ వచ్చే ఏడాదిలోనే.
కానీ బీజేపీ బ్యాలెట్ బాద్ షా అమిత్ షా తెలంగాణ టూర్ తో ఈక్వేషన్స్ మారాయి. తెలంగాణ బాద్ షా సీఎం కేసీఆర్ ను కెలికారు. స్టేట్ లీడర్స్ ఇచ్చిన మిడిమిడి రిపోర్ట్స్ తో అమిత్ షా రెచ్చిపోయారు. కేసీఆర్ సర్కార్ ని తిట్టిపోశారు. అసలే తెలంగాణ పులి కేసీఆర్…తనను..తన తెలంగాణను అన్ని మాటలు అంటే ఊరుకుంటారా…కొదమ సింహాం లా లేచారు. ప్రెస్ మీట్ పెట్టి పంజావిసిరారు. నా ఇలాకాలో భ్రమిత్ షా వేషాలు నడవంటూ పాత కేసీఆర్ ని గుర్తు చేశారు. టాక్స్ వార్ తో జమిలీ ఎన్నికల ప్రతిపాదన మాటాషే..మోదీ ఫోకస్ పెట్టినా కేసీఆర్ నో అనోచ్చు..అమిత్ షా మాటలతో ఊగిపోతున్న తెలంగాణ పెద్దాయన ..మెజార్టీ రాష్ట్రాలు జమిలి ఎలక్షన్లకు సై అన్నా..సహకరించకపోవచ్చు. దీంతో ఇన్నాళ్లూ ముందస్తు జోష్ లో పార్టీలకు జమిలి లేదనడం షాకే…