కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈరోజు శనివారం హైదరాబాద్’లోని గాంధీభవన్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకువెళతానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన గద్దర్…‘‘రాహుల్ నా మనవడు’’ అంటూ సంబోధించారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కూడా ఎవరూ సంతృప్తిగా లేరని, ప్రజల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులేవీ రాలేదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువతకు నాయకత్వం అప్పగించాలని, యువ నాయకత్వం ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలన్నారు. రాహుల్ యువతను నడిపించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు.