టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా జరిగిన మార్పును స్వాగతిస్తున్నట్టు ప్రజా గాయకుడు గద్దర్ వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పై సీఎం కేసీఆర్ కి లేఖ రాస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలో పేదరికం, దోపిడీ వ్యవస్థ, రాష్ట్రాల డెవలప్ మెంట్, విదేశాంగ విధానాలపై బీఆర్ఎస్ స్టాండ్, పాలసీలను వెల్లడించాలని కోరారు. బీఆర్ఎస్ గా జరిగిన మార్పు గుణాత్మక మార్పా? పరిణామాత్మక మార్పా? అనేది స్పష్టం చేయాలన్నారు. పలు అంశాలను టచ్ చేస్తూ ఏ పునాదులపై బీఆర్ఎస్ నిర్మాణం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో వనరులు ఉన్నా ఇంకా పేదరికం, దారిద్ర్యం ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అందినకాడికి అమెరికా, రష్యా, చైనాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. మన దేశంలో ఉన్న విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్న కులాలు దేనికదే ఒక దేశమని, దేశాల సమూహంగా ఉన్న భారత దేశంపై తన స్టాండ్ ఏంటో కేసీఆర్ బుధవారం జరిగే సభలో ప్రజలకు వివరించాలని లేఖలో పేర్కొన్నారు.