అక్కడ ఎవరు చనిపోయినా పెళ్లి ఆగదు.. - MicTv.in - Telugu News
mictv telugu

అక్కడ ఎవరు చనిపోయినా పెళ్లి ఆగదు..

November 17, 2019

marriage .

పెళ్లి కుదిరిన తరువాత ఒక్కోసారి అభ్యంతరాలు తలెత్తి.. ఆగిపోవడం జరుగుతుంటాయి. దురదృష్టవశాత్తు వధూవరుల కుటుంబాల్లో ఎవరైనా చనిపోవడం కూడా జరుగుతుంటుంది. అలాంటి సమయాల్లో పెద్దలు పెళ్లిని రద్దు చేయడం లేదా వాయిదా వేయడం చేస్తుంటారు. 

కానీ..హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని చంబా జిల్లాలో ఎక్కువగా ఉండే గద్దీ సామాజికవర్గంలో మాత్రం ఏదేమైనా ముహూర్త సమయానికి పెళ్లి జగరాల్సిందేనట. ఎవరు చనిపోయినా సరే పెళ్లి ఆగదట. ఒకసారి ముహూర్తాన్ని ఖరారు చేసుకుంటే వాయిదావేసే అవకాశమే ఉండదట. గద్దీ ప్రజల ఇళ్లలో పెళ్లికి ముందు వధూవరుల కుటుంబాల పెద్దలు కలిసి ఇష్టదైవం భోలేనాథుని సమక్షంలో లగ్నపత్రిక రాసుకుంటారు. గద్దీ భాషలో లగ్నపత్రికను ‘లిఖ్నోత్రీ’ అంటారు. తరువాత లిఖ్నోత్రీని తీసుకుని ఉభయ కుటుంబాలవారు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ పురోహితుడు ఓ పత్రం రాస్తాడు. మంగళస్నానాల నుంచి మొదలుకొని వరుడి ఇంట్లో వధువు కాలు పెట్టడం వరకూ అన్ని ముఖ్య ఘట్టాల సమయాలు ఇందులో రాసి ఉంటాయి. దీన్ని శివుని ఆజ్ఞగా గద్దీ ప్రజలు భావిస్తారు. లిఖ్నోత్రీ రాసుకున్న తరువాత ఉభయ కుటుంబాల్లో ఎవరు చనిపోయినా పెళ్లిని మాత్రం ఆపరట. ముహూర్త సమయానికి పెళ్లి జరిపిస్తారట. ఒకవేళ పెళ్లిని వాయిదావేస్తే శివుని ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుందన్నది వీరి నమ్మకం. శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని, ఇప్పటివరకూ ఒక్క పెళ్లి కూడా రద్దు కాలేదని గద్దీ సామజికవర్గం పెద్దలు చెబుతున్నారు.