ట్రాఫిక్ జరిమానాలను సగం తగ్గించిన ముఖ్యమంత్రి
మోటార్ వెహికల్ చట్టం 2019 అమల్లోకి రావడంతో జనాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాస్త కూడా దయలేకుండా ట్రాఫిక్ పోలీసులు ముక్కు పిండిమరీ వసూలు చేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వినబడుతున్నాయి. ఇదెక్కడి అన్యాయం అంటూ కొందరు రకరకాల వీడియోలు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున దూమారం రేగిన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిమానాల మొత్తాన్ని కొంత మేరకు తగ్గిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జరిమానాలతో వణుకుతున్న గుజరాత్‌లోని వాహనదారులకు కాస్తంత ఊరట లభించినంత పనైంది. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.1000 చెల్లించాల్సి ఉంది. గుజరాత్‌లో ఈ మొత్తాన్ని రూ.500లకు తగ్గించారు.
సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వుండగా.. గుజరాత్‌లో రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. అతి వేగంగా వాహనాన్ని నడిపితే రూ.5000 చెల్లించాల్సి ఉంది. గుజరాత్‌లో ఈ మొత్తాన్ని టూవీలర్‌కు రూ.1500, లైట్ మోటార్ వెహికల్స్‌కు రూ.3000, ఇతర వాహనాలకు రూ.5000 జరిమానాగా నిర్ణయించారు. దీంతో గుజరాత్ ప్రజలు ముఖ్యమంత్రికి సోషల్ మీడియాలో గొప్ప నిర్ణయం తీసుకుని పుణ్యం మూటగట్టుకున్నారు అని ప్రశంసిస్తున్నారు.