ఊహాగానాలు నిజమయ్యాయి. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీని వీడారు. కమలానికి రాజీనామా చేసి కొత్త పార్టీని ప్రకటించారు. గత కొంతకాలంగా గాలి జనార్థన్ రెడ్డి పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. పార్టీ పెద్దలు కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినా అతను వెనక్కు తగ్గకుండా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. అదేవిధంగా ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన కొత్త పార్టీ ప్రకటన చేశారు. ఈ సమయంలో బీజేపీపై విమర్శలు చేశారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టి లబ్ధి పొందాలనుకుంటే కుదరదని, కర్ణాటక ప్రజలు ఎప్పుడూ ఐక్యంగా ఉన్నారని, ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో నా అనుకున్న వారే తనను మోసం చేశారని తెలిపారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్ తప్ప..ఎవరూ తమ ఇంటికి రాలేదన్నారు.
కొత్త పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గాలి జనార్థన్ రెడ్డి తెలిపారు. కర్నాటక రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన ముందుకు సాగాలని నిర్ణయించికున్నటన్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీ చేరుకుంటుందుని తెలిపారు. పోటీచేసే నియోజకవర్గాలను త్వరలో వెల్లడించనున్నట్లు గాలి జనార్ధన్ రెడ్డి చెప్పారు. తాను మాత్రం గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
గనుల అక్రమ తవ్వకాల కుంభకోణలో గాలి జనార్థన్ రెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జైలుకెళ్లిన గాలి 2015 నుంచి బెయిలుపై ఉన్నారు. ఆయనకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బళ్లారి, అనంతపురం, కడప వెళ్లడాన్ని కూడా నిషేధించింది. 2020లో మరోసారి బెయిల్ షరతులను సడలించాలంటూ సుప్రీంకోర్టును గాలి జనార్ధన్ రెడ్డి ఆశ్రయించారు. దీంతో కడప, అనంతపురం, బళ్లారి ఎస్పీలకు సమాచారమిచ్చి అక్కడికి వెళ్లొచ్చంటూ తీర్పునిచ్చింది.