ద్రౌపదికి కూడా ఈ కష్టం రాలేదు.. యూపీ మహిళ యదార్థగాథ - MicTv.in - Telugu News
mictv telugu

ద్రౌపదికి కూడా ఈ కష్టం రాలేదు.. యూపీ మహిళ యదార్థగాథ

March 27, 2018

మహాభారతంలో ధర్మరాజు తన సోదరులను, భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోతాడు. అది నిజంగా జరిగిందో లేదో తెలియదుగాని యూపీలోని బులంద్‌షహర్‌లో మాత్రం నిజంగానే జరిగింది. అక్కడ ద్రౌపదిని దుర్యోధనుడు వేధించినట్లే ఇక్కడా వేధించాడు. అక్కడ ద్రౌపది ‘దేవా దీన బాంధవా.. ’ అని భగవంతుణ్ని ప్రార్థించింది. కానీ ఇక్కడ బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. తనను అమ్మేసిన బాడ్కవ్‌కు విడాకులిచ్చేసింది. అయితే ఆమెను పందెంలో గెలుచుకున్న దుర్మార్గుడు మాత్రం ఇంకా వేధిస్తున్నాడు.. ద్రౌపది కంటే ఎక్కువ కష్టాలు పడుతున్న ఈ బాధితురాలి వ్యథార్థ గాథ ఇది.

బులంద్‌షహర్‌కు చెందిన జూదరి మోషిన్ అనే వ్యక్తి 2012లో ఆమెను పెళ్లిచేసుకున్నాడు.  ఇద్దరు కొడుకులు పుట్టారు. మోషిన్ జూదంలో అన్నీ తగలేశాడు. 2015లో ఇమ్రాన్ అనే వ్యక్తితో జూదం ఆడాడు. భార్య, ఇద్దరు కొడుకులను పందెం కాసి ఓడిపోయాడు. ఇమ్రాన్ తర్వాత దుశ్శాసనుడిలా మోషిన్ ఇంటికెళ్లి అతని భార్యను తనవెంట రావాలన్నాడు. ఒంటిపై చెయ్యేసి లాగాడు. ఆమె ప్రతిఘటింది. రోదించింది. అయినా ఆ దుర్మార్గుడు కనికరించలేదు. విషయం పంచాయితీకెక్కింది. పంచాయతీ పెద్దలు ఈ అన్యాయాన్ని ఖండించకపోగా ఇమ్రాన్‌కే వత్తాసు పలికారు. ఒక కొడుకును అతని వెంట పంపించారు.

తనను ఇంత ఘోరంగా అవమానించాడంటూ బాధితురాలు మోషిన్ నుంచి విడాకులు తీసుకుంది. తర్వాత వేరే యువకుడిని పెళ్లిచేసుకుంది. అయితే ఇమ్రాన్ లాక్కెళ్లిన కొడుకు కోసం ఆ తల్లి హృదయం కొట్టుమిట్టాడుతూనే ఉంది. కన్నబిడ్డను తనకు అప్పిగించాలని, దోషులను శిక్షించాలని కోర్టుకు ఎక్కింది.  సోమవారం ఆమె పిటిషన్‌ను పరిశీలించి వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.. మనదేశంలో మోషిన్ వంటి ఆధునిక జూదధర్మరాజుల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్ల కిందట కాన్పూర్ లోనూ ఇలాంటి ఘోరం జరిగింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో ఒకడు తన భార్యను పందెం కాసి ఓడిపోయాడు.