భారత కరెన్సీ నోట్లపై.. గాంధీ, ఠాగూర్, కలాం ఫోటోలు!: ఆర్బీఐ - MicTv.in - Telugu News
mictv telugu

భారత కరెన్సీ నోట్లపై.. గాంధీ, ఠాగూర్, కలాం ఫోటోలు!: ఆర్బీఐ

June 5, 2022

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారతీయ కరెన్సీ నోట్లపై మహత్మా గాంధీ ఫోటోతోపాటు త్వరలోనే దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని అధికారులు భావిస్తున్నారట. ఒకరు బెంగాల్‌కు చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కాగా, మరొకరు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఫోటోలను ప్రింట్ చేస్తారట. కొత్తగా ఆర్‌బీఐ విడుదల చేయనున్న కొన్ని డినామినేషన్ బ్యాంకు నోట్లపై ఈ ఇద్దరి ఫొటోలను ముద్రించాలని నిర్ణయించారట.

ఈ నిర్ణయంపై కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఇటీవలే చర్చలు జరిపి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జాతిపిత మహాత్మా గాంధీ ఫొటోలతో ఉన్న కరెన్సీ నోట్లు చలామణి అవుతూనే ఉంటాయని, కొన్ని డినామినేషన్ నోట్లపై మాత్రమే రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలను ముద్రించనున్నామని సూచించారు. భారత కరెన్సీ నోట్లపై ఎందుకు ఆ ఇద్దరి ఫోటోలను ప్రింట్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు? అనే ప్రశ్నకు ఆర్‌బీఐ.. ”కరెన్సీ నోట్లపై ప్రముఖల ఫొటోలను ముద్రించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను, అవకాశాలను అన్వేషిస్తున్నాం. ఆ అన్వేషణలోనే ఈ యోచన చేస్తున్నాం. మన దేశంలో కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో మాత్రమే ఉంటుంది. కానీ, అగ్రరాజ్యం అమెరికా డాలర్లపై చాలా మంది ఆ దేశ ప్రముఖుల ఫోటోలు ముద్రించబడి ఉంటాయి. ఆ విధంగానే మన కరెన్సీలపై మరో ఇద్దరి ప్రముఖుల ఫోటోలను ముద్రించాలని అనుకుంటున్నాం” అని సమాధానం చెప్తుంది.

మరోపక్క రవీంద్రనాథ్ ఠాగూర్, కలాం ఫొటోలతో కొత్త నోట్ల ముద్రణ ఎంతవరకు వచ్చిందనే ప్రశ్నకు ఆర్‌బీఐ సమాధానం చెప్పింది. ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉండే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గాంధీ, ఠాగూర్, కలాం వాటర్‌మార్క్స్‌ను రెండు సపరేట్ సెట్స్‌గా ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ దిలీప్ టి సహానికి పంపడం జరిగింది. ఆ రెండు సెట్స్‌లో ఎంపిక చేసి అంతిమ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు దిలీప్ సహా చెప్పినట్లు అధికారులు చెప్పారు. ప్రొఫెసర్ సహానీ వాటర్‌మార్క్స్‌ను అధ్యయనం చేయడంలో నిపుణులు ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఆయనకు ఈ ఏడాది జనవరిలో కేంద్రం పద్మశ్రీని ప్రదానం చేసింది.