2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను శుక్రవారం ప్రారంభించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఛత్తీస్‌గఢ్ (రాజధాని రాయ్‌పూర్ వేదికగా ఈ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. మల్లిఖార్జున ఖర్గే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం గంటలకు AICC స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు హాజరుకాలేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు పూర్తి స్వేచ్ఛను, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చేందుకే వారీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశాల్లో మొత్తం 6 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు తీర్మానాలను ఖరారు చేయనున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు స్పష్టమైన రోడ్మ్యాప్ను రూపొందించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ ఫిబ్రవరి 26న జరిగే చివరి రోజున ఆమోదం పొందనున్నాయి. అనంతరం 26తేదీ సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్లీనరీ సమావేశాలను ముగించనున్నారు.
ఈ సమావేశంలో ప్లీనరీ ఎజెండాను నిర్ణయించేందుకు స్టీరింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనేది కూడా నిర్ణయించనున్నారు. ఎన్నికలు జరగకపోతే.. 25 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల్లో 23 మందిని కాంగ్రెస్ అధ్యక్షుడు నామినేట్ చేస్తారు.