గణేశ్ నిమజ్జనం ఇలా చేద్దామా?: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

గణేశ్ నిమజ్జనం ఇలా చేద్దామా?: కేటీఆర్

August 13, 2019

వచ్చే నెలలో దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అవి ముగిశాక విగ్రహాలతో చెరువులు, కుంటలు నిండిపోతాయి. దీంతో నీరు కలుషితం అవుతుంది. దీనిపై ఎవ్వరూ పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. ముఖ్యంగా ఖైరతాబాద్‌లోని అత్యంత ఎత్తైన విగ్రహం సహా.. నగరంలో అనేక విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. ఇది ఒక్క హైదరాబాద్ సమస్య మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా పర్యావరణానికి చాలా ముప్పు వాటిల్లుతోందని అందరికీ తెలిసిన విషయమే. కానీ, తెలిసి కూడా తమ భక్తికి లోటు రాకుండా చూసుకుంటున్నారు భక్తులు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువుల్లోని నీరు కలుషితం అవుతుందనీ పర్యావరణ ప్రేమికులు వాదిస్తున్నారు.

ఈ సమస్యకు పరిష్కారం దిశగా కొత్త విధానానికి నాంది పలకాలని సూచిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గుజరాత్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దశ మాతా ఉత్సవం ఇటీవలే ముగిసింది. అక్కడ దశమాతా విగ్రహాల నిమజ్జనం అహ్మదాబాద్‌లో

సరికొత్తగా నిర్వహించారు. ‘స్వచ్ఛ సబర్మతి’ ఉద్యమంలో భాగంగా స్థానికులు వేల సంఖ్యలో దశ మాతా విగ్రహాలను నదిలో నిమజ్జనం చేయకుండా ఒడ్డుపైనే వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత అధికారులు ఆ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెరువుల్లో నిమజ్జనం చేశారు. 

దీని గురించి అహ్మదాబాద్ నగర మేయర్ విజయ్ నెహ్రా ట్విటర్‌లో షేర్ చేస్తూ, కేటీఆర్‌‌ను ప్రశ్నించారు. ‘గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇలాంటి ప్రయత్నం మనం కూడా చేయలేమా?’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ సోమవారం ట్వీట్ చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిశోర్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్‌కు జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ స్పందించారు. 

ఈ విషయం గురించి మంగళవారం గణేశ్ ఉత్సవాలపై నిర్వహించే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ‘ఈ అంశంపై హైదరాబాదీలు కూడా సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నాం. ‘‘సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్’’ కార్యక్రమం నిర్వహిస్తున్న 30 ఎన్జీవోల ద్వారా మరింత ప్రచారం కల్పించవచ్చు. ఇదే సాధ్యమైతే నగరంలోని చాలా చెరువులను కాలుష్యం బారిన పడకుండా పరిరక్షించే వీలుంటుంది’ అని దానకిషోర్ అన్నారు.