ఆలయాల్లో చోరీలు.. ముఠా అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆలయాల్లో చోరీలు.. ముఠా అరెస్ట్

September 27, 2020

bch

ఏపీలో ఓవైపు ఆలయాల విగ్రహాల ధ్వంసం, మరోవైపు ఆలయాల్లో దోపిడీలు తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆలయాల్లో దొంగతనాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఈ ఘటనలపై రంగంలోకి దిగిన విజయనగరం జిల్లా పోలీసులు ఎట్టకేలకు.. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. 27 ఆలయాల్లో ఈ ముఠా ఇటీవల కాలంలో  నేరాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధురవాడ వాంబే కాలనీకి చెందిన మొగిలిపల్లి నాగార్జున, తోట వీరబాబు, మరుపల్లి ధనరాజుతో సహా ఆరుగురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దోపిడీలు చేస్తున్నారు. ముఠా సభ్యుల్లో ఒకరికి ఆటో ఉండడంతో దాని సాయంతో దోపిడీలకు పాల్పడేవారు. 

ఆటోపై తిరుగుతూ నేరాలు చేయసాగారు. తాజాగా విజయనగరం జిల్లాలో వరుసగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టి దోచుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ విషయమై విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు మాట్లాడుతూ.. ‘ఇటీవల ఆలయాల్లో జరిగే సంఘటన ఆధారంగా కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవాలను ప్రజలు నమ్మవద్దు. ఆలయాల్లో చోరీలు జరిగితే ప్రజలు మత విద్వేషాలకు లోను కావొద్దు. కొందరు నేరస్థులు చోరీలకు  పాల్పడటానికి అలవాటు పడ్డారు. నేరం జరిగినప్పుడు ప్రజలు పోలీసుల సహకారం తీసుకోవాలి’ అని తెలిపారు.