ఐఫోన్ షోరూంని లూటీచేసిన దొంగలముఠా - MicTv.in - Telugu News
mictv telugu

ఐఫోన్ షోరూంని లూటీచేసిన దొంగలముఠా

December 12, 2019

iPhones.

అల్లాటప్ప ఫోన్లను లూటీ చేస్తే ఏమొస్తుందీ.. మాంచి ఖరీదైన ఐఫోన్లను లూటీ చేస్తే కిక్ ఉంటుందని భావించినట్టుంది ఓ దొంగలముఠా. ఐఫోన్ల షోరూంకే సూటిపెట్టింది. ఖరీదైన ఐఫోన్లు, నగదుతో కలిపి మొత్తం రూ. 75 లక్షల విలువైన సొత్తును లూటీచేసింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున నాశిక్‌లోని గంగాపూర్ రోడ్డులో చోటుచేసుకుంది. 

గంగాపూర్ రోడ్డులోని ప్రసాద్ సర్కిల్ సమీపంలో ఉన్న ఐఫోన్ షోరూంలోకి దొంగలు చొరబడ్డారు. రూ. 73.46 లక్షల విలువైన 80 ఐఫోన్లు, రూ. 1.86 లక్షల విలువైన నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. ఉదయాన్నే విధులకు వచ్చిన షోరూం సిబ్బంది దొంగలు పడ్డారని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.  సీసీటీవీ ఫూటేజీని బట్టి ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య ఐదుగురు దొంగలు ఈ చోరీలో పాల్గొన్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు.