Gang of fake accidents on highways
mictv telugu

హైవేలపై ఫేక్ యాక్సిడెంట్ల ముఠా.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు

February 22, 2023

Gang of fake accidents on highways

ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించడానికి మోసగాళ్లు కొత్త ఎత్తుగడను ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు ఆన్‌లైన్, బ్యాంక్, లింకుల మోసాల గురించి విని ఉంటారు. కానీ తొలిసారిగా యాక్సిడెంట్ల మోసాలు బయటపడుతున్నాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లను టార్గెట్ చేస్తున్న ముఠా.. వారి నుంచి డబ్బులు దండుకోవడానికి వినూత్న పథకం వేశారు. కానీ ఇదంతా కెమెరాలో రికార్డవడంతో వారి పన్నాగం వీడియో రూపంలో బయటపడింది.

ఎలా చేస్తారంటే

ముఠా సభ్యులు ముందుగా ఓ జాతీయ రహదారిని ఎంచుకుంటారు. సగటు వేగంతో వచ్చే కార్లను దూరం నుంచి చూసి సెలెక్ట్ చేసుకుంటారు. అవి దగ్గరకు వచ్చినప్పుడు కారు బానెట్ మీద దూకి నిజంగా యాక్సిడెంట్ జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీంతో కారు యజమాని నుంచి డబ్బులు వసూలు చేయాలనే కుట్ర కోణం దాగి ఉంటుందని ఎవరూ అనుకోరు కదా. అందుకే ముఠాలు ఈ కొత్త పథకాన్ని ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నాయి. అయితే వారి దురదృష్టం కొద్దీ ఇదంతా డాష్‌క్యాంలో రికార్డవడంతో ఆ సమయంలో నిజంగా ఏం జరిగిందనేది తెలిసిపోయింది.

పైన చెప్పినట్టు ఓ వ్యక్తి దూరం నుంచి కారును టార్గెట్ చేసి దగ్గరకు రాగానే బానెట్‌పై దూకేశాడు. వెంటనే కోలుకొని డబ్బులు డిమాండ్ చేయడం మొదలెట్టాడు. కానీ ఇదంతా కెమెరాలో రికార్డయిందని యజమాని చెప్పడంతో సదరు వ్యక్తి మౌనంగా జారుకున్నాడు. దక్షిణ భారతదేశంలో జరిగినట్టు చెప్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధించింది. కారులో డ్యాష్‌క్యాం వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలిసింది అని ఒకరు, వీడియో లేకపోతే ఫేక్ యాక్సిడెంట్లు ఉంటాయనే విషయం అస్సలు నమ్మేవాడిని కాదంటూ మరొకరు ఇలా కామెంట్లు చేస్తున్నారు. ప్రజల్లో అవేర్‌నెస్ కలిగించే వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ కారు యజమానిని ప్రశంసిస్తున్నారు.