అవును నయీం ఎన్కౌంటర్ జరిగి సరిగ్గా ఏడాదవుతోంది..ఆగస్టు 8 తెల్లారంగనే లాస్ట్ ఇయర్ ఈ డేట్ కి నరరూప రాక్షసుడు నయీం ఖతమైండు.. ఆ తర్వాత డైలీ సిరీయల్ లెక్క నయీమ్ జాతాకాన్ని మీడియాలో సీరియల్ కిల్లింగ్ స్టోరీస్ వచ్చినయ్.. ఖద్దర్ ,ఖాకీ దోస్తానీ తో ఖల్నాయక్ చేసిన ధందాలు ఒక్కొక్కటీ బయటికొచ్చింది..
జరిగిందేంటి.. ఒరిగిందేంటి ??
నయీమ్ ఎన్ కౌంటర్ జరిగి ఏడాదయింది.. ఈ ఏడాది కాలంలో నయీమ్ కేసులో పోలీసులు దర్యాప్తు ఎలా నడిచింది.. భాధితులకి న్యాయం జరిగిందా.. నయీమ్ ని అడ్డుపెట్టుకుని ధందాలు చేసిన ఖద్దర్, ఖాకీ లకి శిక్షలు పడ్డాయా.. కనీసం వాళ్ళ రోల్ ఏంటో తేల్చారా.. ఏడాదిలో నయీం కేసులో తేల్చిందేంటి.. ఒరిగేందేంటి.. ఇలాంటి సవాలక్ష సవాళ్ళున్నా సమాధానాలు దొరక్క ??
20 ఏళ్ళకు పైగా పాలకుల్ని, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని అరచకాలు చేసిన నయీం ఎన్ కౌంటర్ జరిగి ఏడాదయింది..
కనీసం నయీం లింకుల్నైనా టచ్ చేయకుండా గతంలో లైట్ తీసుకున్న అధికారులకి భిన్నంగా.. ఈ సారి ఏకంగా నయీంనే ఖతం చేయడంతో తెలంగాణ పోలీసులకి ముందుగా ప్రశంసలొచ్చాయ్..కానీ కేసు దర్యాప్తు మొదలు పెట్టిన తర్వాత మాత్రం వరుస విమర్షలొచ్చాయ్..కారణమేంటంటే నయీం అయితే ఖతమయ్యాడు కానీ.. సిస్టమ్ ని అడ్డం పెట్టుకుని అతను చేసిన ధందాలు, సెటిల్మెంట్స్.. నయీమ్ తో లాలూచీ పడి కోట్లు వెనకేసి..అతని నేర సమ్రాజ్యానికి వంతపాడిన తోడు దొంగల సంగతేంటని అంతా మూకుమ్మడిగా విమర్షించారు.. రెడ్ హ్యాండెడ్ గా ఫోటోల్లో బుక్కైన పోలీస్ అధికారులపై తప్పా ఎవరిపై యాక్షన్ తీసుకోలేదన్న అపవాదు తెలంగాణ పొలీస్ శాఖ మూటగట్టుకుంది…
సిస్టమ్ ని వాడుకొని
కరుడుగట్టిన నేరస్తుడు. భూకబ్జాకోర్, హంతకుడు, మాజీ నక్సలైట్.., ఇలా సిస్టమ్ ని వాడుకొని లెక్క లేనన్ని అరాచకాలు చేసిన దుర్మార్గుడు… గతేడాది ఆగస్టు 8న నయీమ్ ను మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్‌లోని మిలీనియం టౌన్షిప్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీముద్దీన్ హతమయ్యాడు..నయీమ్‌పై సుమారు 100కు పైగా కేసులు ..20కిపైగా హత్య కేసులున్నాయి… లొంగిపోయిన నక్సలైట్‌గా నేర చరిత్రను మొదలుపెట్టిన నయీమ్ ఆ తర్వాత అనేక హత్యల్లో కీలక పాత్ర పోషించాడు.. పీపుల్స్ వార్ లో వున్నప్పుడు ఐపీఎస్ వ్యాస్‌ను కాల్చి చంపిన కేసులో..తర్వాత ప్రజా గాయకురాలు బెల్లి లలిత హత్య కేసులో..టీఆర్ ఎస్ నేతలు సాంబశివుడు, మాజీ నక్సలైట్ పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని హత్య చేసింది..
రాములు హత్య కేసులో నయీమ్ నిందితుడు.
భువనగిరి కోర్టులో వేసిన ఒక చార్జీషీటులో సిట్..సాక్షి నెంబర్ 31గా ఉన్న మల్లికార్జున్ ద్వారా సిఐ గండికోట వెంకటయ్య, 38 వ సాక్షి వెంకటరామయ్య వాంగ్మూలంలో డిఎస్పీ సాయి మనోహర్ పేరు, 33వ సాక్షి వెలగపూడి శివరాం ప్రసాద్ ద్వారా డిఎస్పీ ఎం.శ్రీనివాస్ రావు పేరు, 32వ సాక్షి నాగేంద్ర ప్రసాద్ ద్వారా అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ రావు, 36వ సాక్షిగా ఉన్న నర్పింహా రెడ్డి వాంగ్మూలం ద్వారా సిఐ బూరా రాజగోపాల్ పేరు , 29వ సాక్షి యూసూఫ్ ఖాన్ వాంగ్మూలం ద్వారా సిఐ మస్తాన్ అలీ పేర్లను కోర్టులో సిట్ అధికారులు సబ్మిట్ చేశారు.
అయితే ఓ వైపు దర్యాప్తు నడుస్తున్నా..కోర్టుల్లో కేసులు ప్రూవ్ చేసేందుకు పోలీసులకి చుక్కలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
కేవలం భాదితుల వాంగ్మూలాలకే సిట్ పరిమితం కావడం..
ఎందుకంటే ఈ కేసులో సరైనా వాంగ్మూలాలు సేకరించకపోవడం,బలమైన ఆధారాలు లేకపోవడం. ఏళ్ల నుండి బెదింపులకి పాల్పడి ఆస్తులు రాయించుకున్నట్టు తేల్చలేకపోవడం. ఆస్తులన్నీ పక్కాగా రిజిస్ట్రేషన్స్ ఉండడం. కేవలం భాదితుల వాంగ్మూలాలకే సిట్ పరిమితం కావడం..లోతైన దర్యాప్తు చేసి నయీమ్ తో లింకులున్న మాజీ పోలీస్ బాసులకి నోటీసులివ్వకపోవడం. నయీమ్ ఇళ్లతో పాటు డెన్లలో లభించిన డాక్యుమెంట్లను బట్టి 1,130 ఎకరాల భూమి నయీమ్ అనుచరులు, రిలేటివ్స్, బినామీల పేర్ల మీద ఉన్నట్టు సిట్ గుర్తించినా వెనక్కి తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారన్న విమర్షలున్నాయ్..తెలంగాణతో పాటు గోవా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 24 ఇళ్లను నయీమ్ తన సంబంధీకుల పేర్ల మీద పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించాడు.
వాటికి సంబంధించి అన్ని పత్రాలు చట్టపరంగా సక్రమంగా ఉన్నాయని, వాటిని జప్తు చేసుకోవడం అంత సులభం కాదని న్యాయ నిపుణులు పోలీస్ శాఖకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనితో కేసులో ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు..
భువనగిరి, యాదాద్రి, మిర్యాలగూడ, షాద్‌నగర్, కల్వకుర్తి, శంషాబాద్, నార్సింగి, నల్లగొండ.. ఇలా పలు ప్రాంతాల్లోని తమ భూములను నయీమ్ తక్కువ ధరలకే లాక్కున్నాడంటూ 204 మంది సిట్‌కు ఫిర్యాదు చేశారు..అయితే ఏళ్ల కింద జరిగిన భూకబ్జాల్లో ఆధారాలు ఏ విధంగా సేకరించాలనేది సవాలుగా మారింది.
చార్జిషీట్ దాఖలు చేశాక కోర్టులో జరిగే వాదోప వాదాలపై ఆధారపడి జప్తు ఆదేశాలు వెలువడతాయా..
నయీమ్ ఇంట్లో దొరికిన అకౌంట్ బుక్, బాధితుల వాంగ్మూలం సరిపోతాయా? కోర్టులో ఇవి నిలబడతాయా? అన్నది కోశ్చన్ మార్కే అంటున్నారు లీగల్ ఎక్స్ పర్ట్స్. నయీమ్ అక్రమాస్తుల కేసులో పోలీసులు వేసే చార్జిషీట్లో బలమైన ఆధారాలుంటేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
శేషన్న అండ్ టీమ్ ఆచూకీ ఇప్పటిదాకా పోలీసులు తేల్చలేకపోయారు..
ఆగస్టు 8.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అయిన రోజు. ఇది జరిగి ఏడాదవుతోంది. నయీమ్ కేసులో ఇప్పటి వరకు 174 కేసులు పెట్టి 116 మందిని ఆరెస్ట్ చేసిన పోలీసులు.. 848 సాక్ష్యాలు నమోదు చేసి. 5 చార్జ్ షీట్లు దాఖలు చేశారు. అయితే నయీమ్ ఎన్ కౌంటర్ జరిగి ఏడాదయినా నయీం ప్రదాన అనుచరులు శేషన్న అండ్ టీమ్ ఆచూకీ ఇప్పటిదాకా పోలీసులు తేల్చలేకపోయారు..
గ్యాంగ్‌స్టర్ డెన్లలో బస్తా ఫొటోలు లభించాయి.ఇందులో రాజకీయ నాయకుల నుంచి ఐపీఎస్ అధికారులు, కానిస్టేబుళ్ల వరకు ఫొటోలున్నట్టు తెలుస్తోంది. మరి వాటిని మీడియాకి ఎందుకు రిలీజ్ చేయలేదన్న విమర్శలు సిట్ మూటగట్టుకుంది. హత్యల్లో ఎక్కువగా రియల్ మర్డర్స్తో పాటు రైవలరీ మర్డర్సే..నయీమ్ భూదందాలకు సహకరించిన నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను విచారించలేదు..ఈ కేసులో విచారిస్తారన్న భయంతో ఐపీఎస్ గాయబై అజ్ఞాతంలోకెళ్ళాడు.
రాజకీయాల్లో కలసి రాక అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులన్నింటికి తన తోడల్లుడిని బినామీగా పెట్టుకొన్న రిటైర్డ్ డీజీపీని కూడా సిట్ విచారించకుండా లైట్ తీసుకుందన్న విమర్శలున్నాయ్.
మరోవైపు గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో తిమింగలాలను వదిలేసి కేవలం చేపలను మాత్రమే పట్టుకున్నారా ? రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీమ్ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా ఆధారాల్ని సేకరించడంలో, అసలు నిందితుల్ని పట్టుకోవడంలో, ఏళ్ళ తరబడి నయీమ్ ని పెంచి పోషించిన నేతలు అధికారుల రోల్స్ తేల్చడంలో, స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ఫెయిలయిందన్న విమర్షలున్నాయ్..నయీమ్ ను అడ్డుపెట్టుకుని ఫాంహౌసులు, ఎకరాలకొద్దీ భూములను, కిలోల కొద్దీ బంగారాన్ని, విదేశీ పర్యటనలకు అవసరమైన డబ్బును,గిఫ్టులుగా తీసుకున్నారని చెప్పిన పోలీసులు వాళ్ల చిట్టాని బయటపెట్టలేదు..
ఇదిట్లా ఉంటే నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా మారి తర్వాత అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీం భయంకరమైన క్రిమినలని..నయీం గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు పెద్ద సినిమానే తీయాలంటూ, త్వరలో నయీంపై సినిమా తీస్తాను, రక్తచరిత్ర సినిమాని రెండు భాగాల్లోనే చూపించాను కానీ నయీం చరిత్రను మూడు భాగాల్లో తెరకెక్కిస్తానన్నారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.