వికాశ్ దుబే ప్రధాన అనుచరుడి కాల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

వికాశ్ దుబే ప్రధాన అనుచరుడి కాల్చివేత

July 8, 2020

cv vc

ఎనిమిది మంది పోలీసులను అంత్యంత పాశవికంగా చంపిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ముఠాపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. అతని అనుచరులను ఒక్కొక్కరిగా ఏరివేస్తున్నారు. బుధవారం ఉదయం అనుచరుడు అమర్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్ పూర్ పట్టణంలో కాల్చి చంపారు. పక్కా సమాచారంతో వెళ్లిన సిబ్బందిపై మరోసారి అతడు దాడికి పాల్పడటంతో హతమార్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా పోలీసులు విడుదల చేశారు. 

అమర్ దుబే గ్యాంగ్ స్టర్ వికాశ్ దుబేకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా విడుదల చేశారు. ఇటీవల  కాన్పూరులో 8 మంది పోలీసులను హతమార్చిన కేసులో అమర్ కూడా ఉన్నారు. ఇప్పటికే పరారీలో ఉన్న వికాస్ దూబేతోపాటు అతని ముఠా సభ్యుల కోసం 40 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసులకు కూడా ముందుగానే సమాచారం అందించారు. ఇటీవలే అతని ముఠాలోని ముగ్గురుని కూడా కాల్చి చంపారు. కాగా కరుడుగట్టిన నేరగాడైన వికాశ్ దుబేను అరెస్టు  చేసేందుకు వెళ్లిన పోలీసు బృందంపై అతని అనుచరులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది మరణించారు. పోలీసు శాఖలోని కొంత మంది గూఢచారుల వల్లే ఈ విషయం తెలిసిందని 68 మంది కాన్పూర్ పోలీసులపై బదిలీ వేటు వేశారు. ఎస్పీ అనంత్ దియో తివారీని కూడా  మరో చోటుకు పంపించారు.