వికాస్‌ దుబే కోసం పోలీసుల గాలింపు.. మ‌రో అనుచరుడు హతం - MicTv.in - Telugu News
mictv telugu

వికాస్‌ దుబే కోసం పోలీసుల గాలింపు.. మ‌రో అనుచరుడు హతం

July 9, 2020

Gangster Vikas Dubey Close Aide

అత్యంత పాశవికంగా 8 మంది పోలీసులను చంపేసిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హర్యానా,ఢిల్లీ,యూపీ ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అతని అనుచరులను ఒక్కొక్కరిగా ఏరివేస్తున్నారు. తాజాగా పోలీసుల కాల్పుల్లో మరో వ్యక్తి మరణించాడు. ప్రభాత్ మిశ్రా అనే అనుచరుడు హతమయ్యాడు. నిన్న అమర్ దుబే చనిపోగా.. తాజాగా ప్రభాత్ కూడా హతమవడంతో అతని అరాచక సామ్రాజ్యాన్ని మెల్లమెల్లగా కూల్చేస్తున్నారు. 

కాన్పూర్‌లో ఇటీవల ఓ కేసులో అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై వికాస్ దూబే సహ అతని అనుచరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి వారి కోసం 40 బృందాలు గాలిస్తున్నారు. కాన్పూర్‌ ఘటనలో పాల్గొన్నవారిలో ఐదుగురిని పోలీసులు మట్టుబెట్టారు. తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్ స్టర్ హర్యానా, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ హోటల్లో బస చేసిన ఫుటేజీ కూడా లభించడంతో గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు వికాస్ దుబేకు సహకరించిన చౌబేపూర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వినయ్ తివారి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కె.శర్మలను అరెస్ట్‌ చేసి ప్రశ్నించారు. దుబే ఆచూకీ చెప్పిన వారికి రూ. 5 లక్షల నజరానా కూడా ప్రకటించారు.