మంత్రివర్గంలోకి గంగుల, పువ్వాడ!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి ఆదేశాలు జారీచేశారు.
తొలుత నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం మరో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గంలో తన్నీరు హరీశ్ రావు, కేటీఆర్, సత్యవతి రాథోడ్, సబిత ఇంద్రారెడ్డిలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గంగుల కమలాకర్, అలాగే ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ కుమార్ పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేశారని తెలుస్తోంది. పువ్వాడ అజయ్ కుమార్‌కు వైద్య ఆరోగ్య శాఖను ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆ శాఖను నిర్వహిస్తున్న ఈటెల రాజేందర్ ను వేరే శాఖకు బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.