గంజాయి సర్వరోగ నివారిణి అంటున్న మేనకా గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

గంజాయి సర్వరోగ నివారిణి అంటున్న మేనకా గాంధీ

December 2, 2017

తులసీ వనంలో గంజాయి మొక్క.  మంచికి తులసీ, చెడుకు గంజాయిని ప్రతిరూపంగా చెప్పే సామెత ఇది. అయితే ఇప్పుడు ఈ సామెతను మార్చుకోవాల్సిన టైం వచ్చింది. గంజాయి వనంలో తులసీ మొక్కగా చెప్పుకోవాలి. ఎందుకంటే గంజాయి ఇక ఎప్పుడు చెడుకు ప్రతిరూపం కాదు. ఇన్ని రోజులు తులసీ చెట్టులో ఔషధ గుణాలున్నాయని చదువుకున్న పుస్తకాల్లోనే గంజాయి గురించి గొప్పగా రాయాల్సిన టైం వచ్చింది. మనిషిని చిత్తు చేసే మత్తు మందు గంజాయి అని ఎవరైనా అంటే  అలాంటి వాళ్లకు ఒకసారి కేంద్రమంత్రి మేనకాగాంధీ తీసుకొస్తున్న ప్రతిపాదన గురించి చెప్పండి. క్యాన్సర్ తో పాటు కొన్ని వ్యాధుల చికిత్స కోసం గంజాయిని ఔషధంగా వాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కేబినేట్ కమిటీకి మేనక ఓ నివేదికను కూడా ఇచ్చారు. త్వరలోనే దీనిపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోబోతుంది. ఇంతకీ గంజాయితో కలిగే లాభాలేంటీ? గంజాయిపై ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలు  ఏం తేల్చాయి? ఆ వివరాలుగంజాయి-బహుళ ప్రయోజనాలు

1883 వరకు ప్రపంచంలో గంజాయి ఎక్కువగా సాగయింది. జనపనార ఉపయోగం ప్రపంచానికి తెలియడానికి ముందే గంజాయినే జనపనార లాగా వాడారు.  దీంతో పాటు మెడిసిన్స్, ఫైబర్, ఫ్యాబ్రిక్, పేపర్ ను గంజాయి నుంచి తయారుచేయవచ్చు. అమెరికా పోరాట యోధుల్లో ఒకరైన బెంజిమెన్ ఫ్రాంక్లిన్ గంజాయితో పేపర్ తయారుచేసే ఫ్యాక్టరీలను స్థాపించాడు. అమెరికా స్వాంతంత్ర్యానికి సంబంధించిన మొదటి రెండు డిక్లరేషన్ లు గంజాయి పేపర్ మీదే తయారయ్యాయి.

18వ శతాబ్దం వరకు అమెరికాలో టెక్స్ టైల్స్ పరిశ్రమలు గంజాయిని ఉపయోగించే వస్త్రాలను తయారుచేశాయి. 19వ శతాబ్దం మొదట్లో యాభై శాతం మందులు గంజాయితోనే తయారయ్యేవి. క్వీన్ విక్టోరియా కూడా లైంగిక సమస్యలకు గంజాయితో తయారయిన తైలాన్నే ఔషధంగా వాడిందట. 1938లోనే  పాపులర్ మెకానిక్ మేగజైన్… న్యూ బిలియన్ డాలర్ క్రాప్ పేరుతో గంజాయి పంట సాగుతో వచ్చే లాభాలపై ఓ ఆర్టికల్ రాసింది. దాని ప్రకారం గంజాయిలోని థ్రెడ్ లైట్ ఫైబర్ తో ఐదువేల రకాల టెక్స్ టైల్ వస్తువులను తయారు చేయవచ్చు. ఇంతేకాదు 25 వేల వస్తువుల తయారీలో గంజాయి సెల్యులోజ్ కీలకపాత్ర పోషిస్తుంది. డైనమైట్, సెల్ ఫోన్ తో పాటు మోడ్రన్ పరికరాల ఉత్పత్తిలో గంజాయే ప్రధాన పాత్ర పోషించబోతోందని పాపులర్ మెకానిక్ ఆధారాలతో ఆర్టికల్ రాసింది.

నిషేధం

20వ శతాబ్దం మొదట్లో అమెరికాలో గంజాయిని నిషేధించారు. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. వాటిలో జాతివివక్ష ప్రధాన కారణం. అమెరికా, మెక్సికోల్లోని బ్లాక్స్. గంజాయి తాగిన తరువాత తెల్లవాళ్లని లెక్కచేసేవాళ్లు కాదు. వాళ్లతో సమానంగా నడిచేవారు. దీంతో గంజాయిపై తెల్లజాతి ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ఇక ఎన్నో రకాల వస్తువులకు ముడిసరకుగా గంజాయిని ఉపయోగించడం కూడా దానిపై నిషేధానికి మరో కారణం. ఒక్క గంజాయితోనే వస్తువులన్నీ తయారుచేస్తే మిగతా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయన్న భయంతో  దాని సాగును అమెరికా నియంత్రించింది. ఆ తర్వాత మిగతా ప్రపంచం కూడా అమెరికాను అనుసరించింది. అయితే గంజాయిపై నిషేధం విధించిన అమెరికా దాని ఫలితాలపై రహస్యంగా పరిశోధనలు చేస్తోంది. యాంటీ బయాటిక్స్ కు కూడా లొంగని మొండి వ్యాధులపై గంజాయిని ఆయుధంగా ప్రయోగిస్తోంది. దీర్ఘకాలిక, మొండి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కొన్నేళ్ల నుంచి గంజాయితో తయారుచేసిన సిగరెట్లను ఇస్తోంది.

మెడికల్ పరిభాషలో గంజాయిని మెడికల్ మారవానా అంటారు. గంజాయిని ఔషధంగా వాడాలన్న ప్రతిపాదన 1982లోనే వచ్చింది. అమెరికాకు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ గంజాయి నుంచి ఔషధాలను తయారుచేసే పరిశోధనలు మరింత జరగాలని సూచించింది. మిగతా ఔషధాల కంటే భిన్నంగా, సమర్థంగా వ్యాధులను, వ్యాధి కారకాలను గంజాయి ఎదుర్కొంటుందని రిపోర్ట్ ఇచ్చింది. ప్రాథమికంగా చేసిన కొన్ని ప్రయోగాలతో ఈ విషయాలను తెలుసుకున్నామంది.

హాలీవుడ్ పాపం

తరతరాలుగా గంజాయి గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఒక్కసారి దాన్ని ఉపయోగించడం మొదలుపెడితే వ్యసనంలా మారుతుందన్న అనుమానాలున్నాయి. దీంతో పాటు హాలీవుడ్ సినిమాలు చేసిన దుష్ప్రచారం గంజాయిపై భయాలను కలిగించాయి. గంజాయి తీసుకున్నవారు క్రూరంగా మారుతారనీ, ఎవరిమాటా వినరన్న వాదనలున్నాయి. అయితే ఇవేవి నిజం కావని 1999లో అమెరికాకు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ఓ నివేదికిచ్చింది. ఆల్కహాల్ తో పోలిస్తే గంజాయికి అడిక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువంది. ఇంతేకాదు ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలు అప్పటికప్పుడు కలిగించే ఉద్రేకం గంజాయి తీసుకోవడం వల్ల ఉండదని తేల్చింది.

గంజాయిపై సరైన పరిశోధనలు జరగకపోవడానికి దానిపై ఉన్న నిషేధమే కారణం. అమెరికాలో నిషేధిత వస్తువుల జాబితాలో గంజాయి మొదటిస్థానంలో ఉంది. అందుకే 1980ల్లోనే అమెరికాలోని డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ కోర్టులో గంజాయిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కొంతమంది పరిశోధకులు పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు డాక్టర్ పర్యవేక్షణలో గంజాయిని ఔషధంగా తీసుకోవడానికి అనుమతిచ్చింది. అందుకే మెడిసిన్ గా గంజాయిని అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చింది. అయితే డీఈఏ కోర్టు ఆదేశాలను అమెరికా ప్రభుత్వం పై కోర్టులో సవాల్ చేసి స్టే తెచ్చుకుంది.

క్యాన్సర్ కు మందు

అమెరికాకు చెందిన పాయింట్ హ్యాట్ ఫీల్డ్ జీవితాన్ని గొంతు క్యాన్సర్ పూర్తిగా మార్చేసింది. కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్ మెంట్ తీసుకున్నా కూడా క్యాన్సర్ మళ్లీ అటాక్ చేసింది. కీమోతో హ్యాట్ ఫీల్డ్ నరకం చూశాడు. వాంతులు, సైడ్ ఎఫెక్ట్ తో విపరీతంగా బరువు తగ్గాడు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోయేసరికి అతడికి ట్రీట్ మెంట్ చేస్తున్న అంకాలజీ డాక్టర్ జాక్ హ్యాన్ సాల్డ్ గంజాయిని సజెస్ట్ చేశాడు. ఒక డాక్టర్ అలా చెప్పడం అమెరికాలో చట్ట వ్యతిరేకం అయినా… పేషెంట్ ను బతికించడానికి భావించాడు డాక్టర్ జాక్. అయితే ఇందుకు అంకాలజీ సోషల్ వర్కర్ వెండీ గ్వానర్ నుంచి పర్మిషన్ రావాలి. హ్యాన్ సాల్డ్ కేసును స్టడీ చేసిన వెండీ మెడికల్ మార్వానా ట్రీట్ మెంట్ కు ఓకే చెప్పింది. ఆమె నిర్ణయం అద్భుత ఫలితాన్నిచ్చింది. గంజాయిని ఔషధంగా తీసుకోవడం ప్రారంభించిన కొన్ని రోజులకే హ్యాట్ పీల్డ్ క్యాన్సర్ తగ్గడం మొదలయింది..ఇప్పుడు అతను క్యాన్సర్ ను జయించాడు..

గంజాయితో ఔషధాలను తయారుచేయడానికి మొదట్లో ముందుకురాని ఫార్మకంపెనీలు ఇప్పుడు మనసు మార్చుకున్నాయి..గంజాయితో అన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చని, ఔషధ తయారీకి పర్మిషన్ ఇవ్వాలని యూఎస్ డ్రగ్ డిపార్ట్ మెంట్ కు అప్లికేషన్లు పెట్టుకున్నాయి..క్యాన్సర్, పార్కిన్సన్, ఆల్జిమర్స్, ఒబెసిటీ, గుండె నొప్పి,కండరాల సంబంధిత వ్యాధి,మూర్చను నయం చేసే లక్షణాలు గంజాయికి ఉన్నాయని డ్రగ్ డిపార్ట్ మెంట్ ముందు వాదనలు వినిపించాయి..కొన్ని కంపెనీలు మందును కూడా తయారుచేశాయి..

ఒక్క మొక్క  ఇన్ని రకాల వ్యాధులను ఎలా తగ్గిస్తుంది?ఇదంతా నిజమేనా?

1990 మొదట్లో పరిశోధకులు మనిషి శరీరంలో అసాధారణమైన పదార్థాన్ని కనుక్కున్నారు. మెదడు స్పందనలను కణాలకు అందించే గ్రాహకాలను గుర్తించారు. ఇవి కెనాబినాయిడ్స్ అనే రసాయన సమ్మేళనాలు. శరీరానికి ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు… దీనిపై మెదడు నుంచి వచ్చే స్పందనలను కెనాబినాయిడ్స్ కణంలోకి పంపిస్తాయి. వాటిని యాక్టివేట్ చేసి సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తాయి. కెనాబినాయిడ్ రిసెప్టర్స్ అని పిలిచే ఈ గ్రాహకాలు మెదడులోను, రోగనిరోధక వ్యవస్థలోను రెండు రకాలుగా ఉంటాయి. మెదడులో ఉండేవాటిని సీబీ-వన్ రిసెప్టర్స్ అనీ, ఇమ్యూన్ సిస్టంలో ఉండే వాటిని సీబీ-టూ రిసెప్టర్ట్స్ అని పిలుస్తారు.

సీబీ-వన్ గ్రాహకాలు మెదడుతో పాటు కీలకమైన గుండె, కిడ్నీలు, కాలేయం, జీర్ణవ్యవస్థలో కూడా ఉంటాయి. కాకపోతే అవి యాక్టివ్ గా ఉండవు. వీటిని యాక్టివ్ చేయడానికి శరీరం సొంతగా కెనాబినాయిడ్స్ ను ఉత్పత్తి చేసుకుంటుంది. వీటినే ఎండో కెనాబనాయిడ్స్ అంటారు. కణాలను క్రియాశీలం చేసే ఎండో కెనాబినాయిడ్స్ లాంటివే… గంజాయి మొక్కల్లోనూ ఉండడమే సైంటిస్టులను ఆకర్షించింది.

శరీరంలో అచేతనంగా ఉన్న కెనాబినాయిడ్స్ గ్రాహకాలకు గంజాయిలోని కెనాబనాయిడ్స్ రసాయనం తాళం చెవిలా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. గంజాయి ప్రభావంతో అవి యాక్టివేట్ అవుతాయి. ఈ ప్రక్రియే కేన్సర్ నుంచి కాపాడుతుందంటున్నారు సైంటిస్టులు. శరీరంలోని ఏదైనా కణానికి కేన్సర్ వస్తే అది సహజ లక్షణాన్ని కోల్పోతుంది. మిగతా కణాల్లాగ చనిపోకుండా అసాధారణంగా పెరుగుతుంది. శరీరమంతా వ్యాపిస్తుంది. అయితే కేన్సర్ కణం రోగనిరోధక వ్యవస్థలోని సీబీ టూ రిసెప్టర్స్ కు లొంగుతోందని సైంటిస్టులు తెలుసుకున్నారు. ఇలాంటప్పుడు గంజాయిలోని కెనాబినాయిడ్స్ వల్ల యాక్టివ్ అయిన సీబీటూ రిసెప్టర్స్… క్యాన్సర్ కణాన్ని లొంగదీసుకుని చంపేస్తాయంటున్నారు. ఆ కణం తనకు తానే చనిపోయేలా మెదడు నుంచి వచ్చే సందేశాన్ని ఎండో కెనాబినాయిడ్స్ సమర్థంగా దానికి పంపిస్తాయి. దీనివల్ల కేన్సర్ తగ్గుతుందని చెబుతున్నారు సైంటిస్టులు.

గంజాయితో క్యాన్సర్ ను తగ్గించే పరీక్షలు ల్యాబ్ లో విజయవంతం అయ్యాయి.  ఎలుకల మీద చేసిన పరీక్షల్లో 30 శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. మిగతా ఎలుకల్లో క్యాన్సర్ కణం పరిమాణం, ప్రభావం బాగా తగ్గింది. అయితే గంజాయితో దుష్పలితాలు ఉండవన్న నమ్మకం వచ్చేవరకు క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని సైంటిస్టులు చెపుతున్నారు.

గంజాయి మత్తుమందు అంటోంది ప్రపంచం. గంజాయి సర్వరోగ నివారిణి అంటున్నారు సైంటిస్టులు. ఈ చిక్కుముడి వీడడానికి ఇంకెంతకాలం పడుతుందో అప్పటిదాకా గంజాయి మత్తా? మహత్తా? అన్న అనుమానం కొనసాగుతుంది.