టీడీపీకి షాక్.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి షాక్.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా

October 27, 2019

Gannavaram mla vallabhaneni vasmsi resigns tdp 

టీడీపీకి దెబ్బపైన దెబ్బ తగులుతోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన వాట్సాప్‌లో చంద్రబాబు నాయుడికి లేఖ పంపారు. తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. వైకాపా నేతలు తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని, తన అనుచరులను కాపాడుకోడానికే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని పేర్కొన్నారు.  

‘మీ సారథ్యంలో ప్రజాప్రతినిధిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యేగా విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను.  స్థానిక వైకాపా నాయకులు, ప్రభుత్వ అధికారుల ధోరణితో నా అనుచరులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను తొలగించేందుకు వేరే వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉన్నా నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. అనవసర శత్రుత్వం వద్దు…’ అని లేఖలో పేర్కొన్నారు.

వంశీ రేపేమాపో పచ్చపార్టీని వీడి వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దీపావళి పండగ రోజు అవి నిజమయ్యాయి. ఈ నెల 25న ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడంతో పార్టీని వీడతారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వంశీపై ఇటీవల ఫోర్జరీ  కేసు నమోదైంది. అది తప్పుడు కేసని మండిపడిన వంశీ తర్వాత తన అభిమానులతో సమావేశమమై భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించారు.

వంశీ వైకాపాలోకి వస్తే తీసుకోవద్దని పార్టీ నతే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేస్తున్నారు. మొన్నటివరకు జగన్‌ను తిట్టిన వంశీ రాత్రికి రాత్రి పోలోమని వచ్చేస్తే చేర్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన యార్లగడ్డ 850 ఓట్ల తేడాతో వంశీ చేతిలో ఓడారు. తర్వాత వంశీపై చాలా ఆరోపణలు చేశారు. ఆయన తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.