పెళ్లికూతురు గుర్రమెక్కింది.. ఓ మంచిపని కోసం! - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికూతురు గుర్రమెక్కింది.. ఓ మంచిపని కోసం!

January 31, 2018

పెళ్లికానివ్వండి.. చావు కానివ్వండి.. మరేదైనా కానివ్వండి.. సంప్రదాయాలు చాలావరకు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పెళ్లికొడుకు వస్తున్నాడంటే చేసే ఆర్భాటం అంతాఇంతాకాదు. చాలా ప్రాంతాల్లో వరుడు గుర్రంపై వస్తుంటాడు. కలల రాకుమారుడుగుర్రంపై వస్తాడని బోలెడు సినిమా పాటలు కూడా ఉన్నాయి.అయితే ఓ వధువు ఈ గుర్రం-పెళ్లికొడుకు సంప్రదాయానికి దిమ్మతిరిగే షాకిచ్చింది. మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోరంటూ పెళ్లి చేసుకోవడానికి గుర్రమెక్కింది. దీంతో జనం ఎగబడి మరీ చూశారు. ఈ ముచ్చట రాజస్తాన్‌లోని చిరావాలో సోమవారం జరిగింది. బ్రిటన్‌లో ఎంబీఏ చదివిన గార్గీ అహ్లావత్ బీజేపీ మహిళా ఎంపీ సంతోష్ కూతురు. సంతోష్ ‘బేటీ బచావో.. బేటీ పఢావో’కు గార్గి తల్లి ప్రచారకర్త. తన తల్లి ప్రచారానికి మద్దతుగా తాను గుర్రమెక్కి పెళ్లి చేసుకున్నానని, వరుడికి గట్టి పోటీ ఇచ్చానని గార్గి చెప్పింది. తమ జిల్లా అయిన జుంజునులో స్త్రీపురుషుల మధ్య నిష్పత్తి దారుణంగా ఉందని, ఆడపిల్లలను కాపాడుకోవాలని గార్గి కోరింది. పెళ్లికూతుళ్లు గుర్రాలెక్కడం కొత్తేమీ కాకపోయినా.. సమాజానికి సందేశం ఇవ్వడానికి అశ్వారోహణం చేసింది మటుకు గార్గీనే అని చెబుతున్నారు.