Garlic prices fell sharply in madhya pradesh
mictv telugu

కిలో వెల్లుల్లి రూ. 2.. మూటలు పడేస్తున్న రైతులు

September 1, 2022

దేశంలో వెల్లుల్లి ధరలు ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయాయి. ఎంతో శ్రమించి పెట్టుబడి పెట్టి పండించిన రైతు.. తన పంటను మార్కెట్‌కి తీసుకెళ్తే అక్కడ క్వింటా వెల్లుల్లి ధరను చూసి షాకవుతున్నారు. క్వింటాకు కేవలం రూ. 200 మాత్రమే ధర పలుకుతుండడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అంటే కిలో వెల్లుల్లి ధర కేవలం రెండు రూపాయలు మాత్రమే. దీంతో పంటను అమ్ముకోలేక, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో నదులు, కాలువల్లో పంటను అంతా పారబోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని వెల్లుల్లి రైతుల పరిస్థితి ఇది. మన దేశానికి అవసరమయ్యే వెల్లుల్లి పరిమాణంలో మధ్యప్రదేశ్ నుంచే 60 శాతం ఉత్పత్తి అవుతుంది. విదేశాలకు ఎగుమతి కారణంగా గత రెండేళ్లుగా మంచి ధర రాగా, ఈ ఏడు లక్షల ఎకరాల్లో రైతులు వెల్లుల్లి పంట వేశారు. అయితే ధర మరీ దారుణంగా ఉండడంతో లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. కొన్ని చోట్ల కన్నీళ్లతో పంటను తగులబెడుతున్నారు. దీనిపై వ్యవసాయ అధికారులను ప్రశ్నించగా, భిన్నమైన సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన పంట అంతా నాసిరకంగా ఉంటుందని, దీపావళి తర్వాతే మంచి క్వాలిటీ ఉన్న పంట వస్తుందని తెలిపారు. ఎగుమతులు కూడా అప్పుడే పెరుగుతాయి కాబట్టి ధర కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది జూన్ వరకు ఎగుమతులు 192 శాతం పెరిగి, 12,693 టన్నులకు చేరిందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.