ఆదిమానవుడు ఎక్కడ పుట్టాడో తెలిసిందోచ్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆదిమానవుడు ఎక్కడ పుట్టాడో తెలిసిందోచ్..!

October 29, 2019

భూమిపై మనిషి పుట్టుక గురించి తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మనిషి మొదట ఆఫ్రికాలో కనిపించినట్టు గతంలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. కానీ, ఆఫ్రికా ఖండంలో కచ్చితంగా ఎక్కడ, ఎప్పుడు మనిషి మొదట కనిపించాడన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. గర్వాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన వనేసా హేస్‌ నేతృత్వంలో సాగిన పరిశోధన ఈ ప్రశ్నకు జవాబిచ్చింది.

human being.

వీరి పరిశోధన ప్రకారం.. మనిషి మొదట గ్రేటర్ జాంబెజీ నది దక్షిణ ఒడ్డున 2 లక్షల సంవత్సరాల కిందట జన్మించాడు. ఈ నదికి ఆవల ఒడ్డున నమీబియా, జింబాబ్వే దేశాలు ఉన్నాయి. మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ మ్యాపింగ్ ద్వారా ఈ సంగతి కనిపెట్టారు.. జాంబెజీ నది ఒడ్డున పుట్టిన మనిషి అదే ప్రాంతంలో 70 వేల సంవత్సరాలపాటు జీవించినట్టు పరిశోధన వెల్లడించింది. తరువాత వాతావరణ మార్పుల కారణంగా వీరిలో కొన్ని జాతులు అంతరించిపోయాయని, మిగిలిన వారు ఆఫ్రికాలోని మిగతా ప్రాంతాలకు తరలిపోయినట్టు పరిశోధన వివరించింది. పరిశోధనకు సంబంధించిన వివరాలను ‘ది నేచర్‌’ పత్రిక తాజా సంచికలో ప్రచురించింది. మనిషి సరిగ్గా ఎక్కడ పుట్టాడన్న దానిపై తాము దృష్టిసారించి పదేళ్లుగా రకరకాల జాతుల వారి రక్త నమూనాలు సేకరించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు వనేసా హేస్‌ తెలిపారు. మానవాళి మొదట జన్మించిన ప్రదేశంగా గుర్తించిన ఆ ప్రాంతాన్ని ‘మక్‌గడిక్‌గాడి-ఒక్వాంగో’ అని పిలుస్తారని ఆమె వివరించారు.