విశాఖలో మరో విషవాయువు లీకేజీ ఘటన.. ఇద్దరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో మరో విషవాయువు లీకేజీ ఘటన.. ఇద్దరు మృతి

June 30, 2020

ngvnb

విశాఖపట్నంలో విలయం తాండవిస్తూనే ఉంది. ఇటీవల వెంకటాపురంలో జరిగిన విషయవాయువు దుర్ఘటన మర్చిపోకముందే మరో ఘోర విషాదం నెలకొంది.  పరవాడ ఇండస్ట్రియల్ ఏరియాలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం సృష్టించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సాయినార్ కెమికల్స్‌లోని రియాక్టర్ నుంచి బెంజిన్ వాయువు బయటకు వచ్చింది. అక్కడ పని చేసే ఇద్దరు మరణించగా.. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతున్నారు. 

పరిశ్రమలో వాడే రసాయనాలు బెంజీన్ ఎడిజోల్ అనే ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారు షిఫ్ట్ ఇన్ చార్జ్ రాగి నాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్ ఉన్నట్టుగా వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం కేవలం కంపెనీ పరిసరాల వరకు మాత్రమే పరిమితం కావడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా యాజమాన్యం తీరుపై కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 11.30 గంటలకు ప్రమాదం జరిగితే 3 గంటల వరకు సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన తర్వాతే అసలు విషయాలు వెల్లడి అవుతాయని పేర్కొన్నారు. 

ఇప్పటికే ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. కాగా ఇటీవల ఎల్జీపాలిర్స్ దుర్ఘటన కారణంగా 15 మంది వరకు మరణించినా ఇలాంటి కెమికల్ కంపెనీలపై అధికారులు తనిఖీలు చేయకుండా ఉదాసీనంగా ఉండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని నగరవాసులను ఇండస్ట్రీల నుంచి కాపాడాలని కోరుతున్నారు.