బీజేపీలో చేరతానన్న గౌరి సోదరుడు - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలో చేరతానన్న గౌరి సోదరుడు

September 7, 2017

ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ దారుణ హత్యపై సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. హత్య వెనుక హిందూ శక్తులతోపాటు నక్సలైట్ల హస్తం కూడా ఉండొచ్చేమోనని ఆయన అన్నారు. అయితే నక్సలైట్ల నుంచి ఆమెకు ఎలాంటి ముప్పా లేదని, హిందూమతోన్మాదులే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని గౌరి సన్నిహితులు చెబుతున్నారు. ఇంద్రజిత్ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రజిత్.. బీజేపీలో చేరతానని గతంలో సూచన ప్రాయంగా చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగు చూశాయి.

తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, ముఖ్యంగా బీజేపీలో చేరాలని అనుకుంటున్నానని ఆయన చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో జూలైలో ఒక వార్త వచ్చింది. ‘నేను బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉంటున్న విషయం తెలిసిందే. యడ్యూరప్ప, నరేంద్ర మోదీల స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా.. ఇది ప్రస్తుత ఆలోచన మాత్రమే. దీనిపై కచ్చితంగా తేల్చిచెప్పడం తొందరపాటు అవుతుంది’ అని ఇంద్రజిత్ అన్నారు. ఒక దశలో ఆయన యడ్యూరప్పను… 12వ శతాబ్ది సంఘసంస్కర్త బసవణ్ణతోనూ పోల్చారు.

అయితే సోదరి హత్య నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రవేశ ఆలోచనపై మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాను రాజకీయాల్లో వస్తానని చెప్పలేదని, సినీ దర్శకుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధాంత విభేదాల కారణంగా ఇంద్రజిత్.. గౌరి నడుపుతున్న లంకేశ్ పత్రిక నుంచి 2000లో బయటకు వచ్చారు. నక్సలైట్ నేత సాకేత్ రాజన్ పై ఓ వ్యాసం వేయడానికి ఆయన నిరాకరించారు. తర్వాత గౌరి  ‘గౌరి లంకేశ్ పత్రికె’ పేరుతో సొంత పత్రిక ప్రారంభించారు. ఈ నేపథ్యంలో.. సోదరి హత్య వెనుక నక్సలైట్ల హస్తం కూడా ఉండొచ్చని ఆయన చెప్పడం గమనార్హం. నక్సల్స్ నుంచి గౌరికి బెదిరింపులు వచ్చాయని, ముఖ్యంగా సిరిమనె నాగరాజ్ అనే నక్సలైట్ నేతను గౌరి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడాన్ని వారు జీర్ణించుకోలేపోయారని ఇంద్రజిత్ అన్నారు.

అయితే గౌరి సోదరి, సినీదర్శకురాలు కవితా లంకేశ్ మాత్రం ఇంద్రజిత్ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఇంద్రజిత్ కు ఏమీ తెలియదు.. నిజానికి గౌరి నక్సలైట్ల కోసం పనిచేశారు. సంఘపరివార్ కు వ్యతిరేకంగా పోరాడారు.. ’అని చెప్పారు. గౌరి కూడా తనకు నక్సల్స్ నుంచి బెదిరింపు వచ్చాయని ఎన్నడూ చెప్పకపోవడం విశేషం. మరి ఇంద్రజిత్ ఎందుకు ఈ ఆరోపణలు చేశారని గౌరి అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.