భారత బిలీయనీర్, ప్రపంచ మూడో సంపన్నుడు గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అభివృద్ధికి ఏ ఒక్క రాజకీయ నాయకుడితో ముడిపెట్టలేనని, ఆయనతో సంబంధాల వల్ల లబ్ది పొందాననే ఆరోపణలు సరికావన్నారు. రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ ల కాలంలో వారు అనుసరించిన ఆర్ధిక విధానాల వల్ల లబ్ది పొందానని వెల్లడించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగుమతి, దిగుమతుల విధానాన్ని సరళీకరించినప్పుడు తాను మొదటి విజయం సాధించానని, ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారని తెలిపారు. తర్వాత 91లో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లు భారీ ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు రెండవ లబ్ది లభించిందని వివరించారు. ఇక మూడో లబ్ది 1995లో గుజరాత్ ముఖ్యమంత్రిగా కేశూభాయ్ పటేల్ బాధ్యతలు స్వీకరించినప్పుడు జరిగిందన్నారు. తర్వాత మోదీ ముఖ్యమంత్రి కాగానే గుజరాత్ ఆర్ధిక వ్యవస్థ మొత్తం మారిపోయిందని అభిప్రాయపడ్డారు. తామిద్దరం ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్లం అవడం చేత ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాలు వెల్లడించారు. కాగా, అదానీ ప్రస్తుత ఆస్తుల విలువ ప్రపంచంలోని 85 దేశాల జీడీపీ కంటే ఎక్కువ. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ విలువ కూడా అదానీ ముందు దిగదుడుపే. అలాంటి అదానీ జీవితంలో రెండు మరణగండాలు దాటాడు. అందులో ఒకటి తాజ్ హోటల్ పై ఉగ్రవాదుల దాడిలో చావును కొద్ది దూరం నుంచి తప్పించుకున్నాడు.