ప్రాణాల కన్నా మందే ఎక్కువా?: మందుబాబులపై గంభీర్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణాల కన్నా మందే ఎక్కువా?: మందుబాబులపై గంభీర్ ఫైర్

May 4, 2020

Gautam Gambhir, Furious Seeing Crowd At The Liquor Shops, Said, “Jams Have Become Necessary Due To Life.”

లాక్‌డౌన్‌తో నెలన్నరగా మందు లభించక మందుబాబులు చాలా ఓపిక పట్టారు. లాక్‌డౌన్ పొడిగిస్తూ మద్యం షాపులు తెరవడంతో మందుబాబులు ఇక ఆగేదే లేదన్నట్టు ఎగబడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. కొన్నిచోట్ల మహిళలు కూడా మద్యం దుకాణాల ముందు బారులు తీరి ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు మద్యం దుకాణాలను తెరవడంతో మందుబాబులు ఒక్కసారిగా ఎగబడ్డారు. షాపులు తెరిచిన కాసేపు అందరూ క్యూలైన్ పాటించారు. సామాజిక దూరాన్ని కూడా పాటించారు. కొన్ని గంటల తర్వాత అవేవీ పట్టించుకోకుండా అదుపుతప్పారు. సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు తీసేసి మందు కోసం పోటీలు పడ్డారు. 

దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో మద్యం షాపులను పోలీసులు మూసివేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాగుబోతులపై తీవ్ర ఆగ్రాహం వ్యక్తంచేశారు. ఢిల్లీ జనాలకు ప్రాణాల కంటే మందే ఎక్కువైందని ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మందు షాపుల వద్ద జనాలు ఎగబడుతున్న ఫొటోలను పంచుకున్నారు. నెటిజన్లు కూడా మందుబాబుల తీరుపై మండిపడుతున్నారు. మందు ముందు కరోనా ఎంత అన్నట్టే ఉంది వీరి యవ్వారం చూస్తుంటే అని కామెంట్లు చేస్తున్నారు. మందు వంకతో వీరు మళ్లీ కరోనాను విజృంభించేలా చేస్తున్నారని అంటున్నారు.