సీఎంపై గంభీర్ ఫైర్.. కరోనా క్రెడిట్ ఖాతాలో వేస్కుంటున్నారని.. - MicTv.in - Telugu News
mictv telugu

సీఎంపై గంభీర్ ఫైర్.. కరోనా క్రెడిట్ ఖాతాలో వేస్కుంటున్నారని..

July 11, 2020

కరోనా వైరస్ నివారణలో కనిపిస్తున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునేందుకు ఆప్‌ సర్కార్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారని బీజేపీ తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్‌ ఆరోపించారు. కేజ్రీవాల్‌ను తుగ్లక్‌ అని వ్యాఖ్యానిస్తూ విమర్శలకు దిగారు. కరోనా విషయంలో క్రెడిట్‌ తీసుకోనని చెప్పిన కేజీవ్రాల్‌.. ఈ అంశంపై ప్రతి గంటగంటకూ ఎందుకు ట్వీట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. కరోనాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రజల మద్దతుతో ముందంజలో ఉన్నారని, రాజధానిలో కరోనా నుంచి 84,694 మంది కోలుకున్నారని ఆప్‌ శుక్రవారం ట్విటర్‌లో వెల్లడించింది. ఈ క్రమంలో ఎంపీ గౌతం గంభీర్‌ తీవ్రంగా స్పందించారు.

జూలై ఆఖరు లోపు 5.5 లక్షల కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతాయంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే కాకుండా.. కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు కూడా కేజ్రీ ప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తు చేశారు. కరోనాపై కేజ్రీవాల్ తిరుగులేని పోరాటం చేస్తున్నట్లు, ఇదంతా కేజ్రీవాల్ మహిమే అన్నట్లు ఆప్ ప్రభుత్వం ట్విటర్‌లో ఊదరగొడుతోందని.. దీనిపై ముఖ్యమంత్రితో పాటు, పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని మండిపడ్డారు. కాగా, ఢిల్లీ కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నమోదవుతున్న కేసులు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. దీంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.