Gautham Adani is the second richest man in the world
mictv telugu

గౌతమ్ అదానీ దూకుడు.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం

September 16, 2022

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ఆస్తుల విలువ రోజురోజుకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదానీ తాజాగా రెండో స్థానానికి చేరుకున్నారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రమే ఉన్నారు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, ఫ్రాన్స్‌కి చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్‌లను వెనక్కి నెట్టి అదానీ రెండో స్థానానికి చేరుకున్నారని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. ఈ స్థాయికి చేరిన తొలి ఆసియా వ్యక్తి అదానీయే కావడం గమనార్హం. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం.. అదానీ షేర్లు స్టాక్ మార్కెట్లో రాణిస్తున్నాయి. మొత్తం 155.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఒక స్థానం మెరుగుపరుచుకున్నారు. కాగా, ఈ ఒక్క ఏడాదే అదానీ సంపద 72 బిలియన్ డాలర్లకు పైగా పెరగడం విశేషం. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో పాశ్చాత్య కుబేరుల సంపద విలువ పడిపోయింది. మొన్న ఒక్కరోజే మస్క్ 80 వేల కోట్ల రూపాయలు, బెజోస్ 70 వేల కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది. దీంతో వారి సంపద విలువ భారీగా తగ్గింది. అదానీ రెండో స్థానానికి రావడం ఇది కూడా కారణమే. అటు అదానీ గ్రూపుకు చెందిన కొన్ని షేర్లు 2020 నుంచే వెయ్యి శాతానికి పైగా లాభాలు అందించాయి.