‘ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి…’ అంటూ మూడు నెలల నుంచి హితోపదేశం విని విని విసుగుపుడుతోంది. ఇంట్లో ఉండడం పైకి చెప్పినంత సులువేమీ కాదు. ఎంత సేపూ తినడం, టీవీ చూడ్డం, పడుకోవడం, మళ్లీ లేవడం, బాత్రూంకు పోవడం.. ఇంతేనా జీవితం అని చాలా మంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆవేదనపై బోలెడు మీమ్స్, ఫన్నీ వీడియోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరో సరదా ర్యాప్ వీడియో బయటికొచ్చింది. నటిగా, వ్యాఖ్యాతగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన గాయంత్రీ గుప్తా దీనికి దర్శకత్వం వహించడం విశేషం. ‘హౌస్ పార్టీ’ పేరుతో విడుదలైన ఈ పాట కరోనా బేజార్ ప్రాణులను ఆకట్టుకుంటోంది.
‘ఇంట్లోనే కూర్చుని నాకు తోచింది నేను
చెయ్యాలంటే అరేయ్ ఏం తోచట్లేదు
ఫీలింగ్సే రావట్లే మూడంతా మారింది
నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్ కోసం ఐదో ఫోన్ కాల్ ఇది
కాసేపు ఫోన్ చార్జింగ్‌కి పెడితే..
నాలోన నేను మాట్లాడుకోవం పెరిగింది
నా మీమ్స్ కి నేనే కిందపడి నవ్వేసి.. ’
అంటూ సాగుతుందీ పాట
‘’Outside inside, north side south side out
It’s a House Party
Na game one side, low key quarantine
It’s a House Party..’’
అంటూ ఇంటిబాథను వెళ్లగక్కుతుంది. మహదేవ శాస్త్రి స్వరపరిచిన ఈ గీతానికి శశాంక్ ఆలమూరు స్వరాలు సంగీతం అందిచారు. కరోనాపై ఇప్పటికే తెలుగులో బోలెడన్ని పాటలు రావడం తెలిసిందే. ‘చేతులెత్తి మొక్కతా చేయి చేయి కలపకురా.’, ‘ఇడిసి పెడితె నడిసి నేను పోత సారూ.. ’ పాటలు అటు దు:ఖాన్ని, ఇటు వినోదాన్ని పంచుతున్నాయి.