మాయా లేదు, మంత్రంలేదు.. బాటిల్‌పై టీవీ! - MicTv.in - Telugu News
mictv telugu

మాయా లేదు, మంత్రంలేదు.. బాటిల్‌పై టీవీ!

December 3, 2019

Balancing Art.

మాయాలేదు.. మంత్రంలేదు.. కనికట్టు అంతకంటే లేదు. అంతా బ్యాలెన్సింగ్ నైపుణ్యమే. ఇదే ఓ వ్యక్తిని అరుదైన కళలో నిపుణుడిని చేసింది. మనిషి తన బరువును నియంత్రించుకుంటూ తాడుపై బ్యాలెన్స్ తప్పకుండా  నడవటం ఓ కళ. అలాంటిది ఇతర వస్తువుల బరువును అదుపు చేయడమే కాకుండా.. చిన్న మూలన ఎలాంటి ఆధారం లేకుండా వాటిని నిలబెడుతున్నాడు ఓ వ్యక్తి. పాలస్తీనాకు చెందిన ఓ యువకుడు ఇలాంటి అద్భుతమైన కళా ప్రదర్శనతో అబ్బుర పరుస్తున్నాడు.  

మహమ్మద్‌ అల్‌ షెన్బారీ బ్యాలెన్సింగ్ విద్యలో ఆరితేరాడు. ఎంతగా అంటే ఖాళీ బాటిల్‌పై పెద్ద టీవీని నిలబెట్టడం. రెండు బరువైన సిలిండర్లను ఒకే మూలపై నిలబెడుతున్నాడు. ఇలా ఒకటి రెండూ కాదు..  వస్తువులను అయినా నియంత్రించి అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇతర వస్తువుల శక్తిపై పూర్తి పట్టు సాధించడం అద్భుతమైన విద్య అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే కనికట్టు చేశాడేమో అన్నట్టుగా వస్తువులను చకచకా నిలబెట్టేస్తున్నాడు.  

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ బ్యాలెన్సింగ్‌ ఆర్టిస్ట్‌ నామ్‌ సియోక్‌ బ్యున్‌ వీడియోలు చూసి తాను ఈ ప్రేరణ పొందినట్టు షెన్బారీ తెలిపాడు. ముందుగా కొన్ని రోజులు చిన్న చిన్న వస్తువులపై ప్రయత్నం చేసి వాటిపై పట్టు సాధించానని అంటున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద వస్తువులను కూడా చిన్న మూలపై నిలబెడుతున్నట్టు చెబుతున్నాడు.  తన నైపుణంతో క్షణాల్లోనే వస్తువుల బరువును నియంత్రించగలనని ధీమాగా తెలిపాడు. ఇలా చేయడం వల్ల అయస్కాంతం ద్వారా ఏదైనా వస్తువు నుంచి శక్తిని బయటకు తీస్తే కలిగే అనుభూతి తనకు కలుగుతుందని చెప్పడం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.