తన పూర్వీకులకు పుణ్యలోకాల ప్రాప్తి కోసం భగీరథుడు కఠోర తపస్సు చేసి దివి నుంచి గంగను భువికి తెచ్చాడని చెబుతారు. అలా భువికి వచ్చిన గంగ బాగోగుల కోసం మనకాలంలో మన ముందే ఒక అపర భగీరథుడు అవిశ్రాంతంగా పోరాడాడు. చివరికి నిరాహార దీక్షలోనే కన్నుమూశాడు.
గంగానది ప్రక్షాళన కోసం 109 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ ఇక లేరు. జూన్ 22వ తేదీన నిరహార దీక్ష ప్రారంభించిన ఆయన బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. గంగానది ప్రక్షాళన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అగర్వాల్.. కోరిక తీరకుండానే తనువు చాలించారు.
గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకుందని, దాన్ని స్వేచ్ఛగా ప్రవహించేలా చేయాలన్నది ఆయన డిమాండ్. అయితే ఈ విషయంలో ప్రభుత్వ ఆలసత్వం వహించింది. దీంతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించింది. బుధవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఉత్తరాఖండ్ పోలీసులు రిషికేశ్ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారని వైద్యులు పేర్కొన్నారు.
దీక్ష సమయంలో అగర్వాల్ నీటిలో తేనె కలుపుకుని తాగేవారు. చర్చలు విఫలమవడంతో రెండు రోజులుగా నీరు కూడా తాగడం మానేశారు. ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైరయ్యారు. ఆ తర్వాత తన పేరు జ్ఞాన స్వరూప్ సనందగా మార్చుకున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) కార్యదర్శిగా సేవలందించారు. నదులు, వాటి పరిరక్షణ కోసం గతంలోనూ దీక్షలు చేశారు.