జార్జిరెడ్డి  సినిమాను ప్రతి విద్యార్థీ చూడాల్సిందే (రివ్యూ) - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డి  సినిమాను ప్రతి విద్యార్థీ చూడాల్సిందే (రివ్యూ)

November 22, 2019

జార్జిరెడ్డి.. ఒక వ్యక్తికాదు. ఒక యుద్దం. జీవితానికి కొత్త అర్థం. చదువుకు కొత్త భాష్యం. స్నేహానికి కొత్త నిర్వచనం. చావుకు కొత్త పరమార్థం!  తెలుగు సినీ చరిత్రలో ఇది తవ్వకాల యుగం. నాలుగు రోడ్ల కూడలిలో నిలిచిన తెలుగు సమాజంలాగే టాలీవుడ్ కూడా తాను వెళ్లాల్సిన దారి కోసం వెతుకుతోంది. మూసల్లో ఒదిగిపోకుండా కడలి కెరటాల్లా ఉప్పొంగుతోంది. ‘జార్జి రెడ్డి’ అలా ఉప్పొంగాడు.  మీరు జార్జి రెడ్డి పేరు ఇంతవరకూ విని ఉండకపోవచ్చు. విన్నా అతని గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై తన కోసం కాకుండా విద్యార్థి లోకం కోసం, యువత కోసం, పేదజనం కోసం చిందించిన నెత్తురు ఎంత ఎరుపో మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ లోటు తీరింది. అవును.. పాతికేళ్లకే రెండు పాతికలా పది కత్తిపోట్లకు కుప్పకూలిన ఆ యువకుడి ఉడుకు నెత్తురును దర్శకుడు జీవన్ రెడ్డి దోసిళ్లతో పట్టితెచ్చాడు. తెలుగు వెండితెరపై గతంలో ఎప్పుడూ కదలాడని కొత్త కథను మనకు కొత్తగా పరిచయం చేశాడు. 

మళ్లీ పుట్టాడు..

నిన్న జార్జిరెడ్డి సమాధివద్ద నివాళి అర్పిస్తూ జీవన్ ఓ మాట అన్నాడు. ‘రేపు జార్జిరెడ్డి మళ్లీ పుడుతున్నాడు’ అని. అన్నట్టే ఈ రోజు జార్జి రెడ్డి పునర్జన్మించాడు. సిల్వర్ స్క్రీన్‌ ఫ్రేముల వారీగా కదిలిపోయే అతని బాల్యం, చదువు, పోరాటం, బలిదానం..ప్రేక్షకులను ఊపిరి సలపనివ్వవు. అణచివేత, అన్యాయం, అక్రమం ఎక్కడ ఉంటే అక్కడికి దూసుకొచ్చి తుపానులా విరుచుకుపడతాడు జార్జిరెడ్డి. శత్రువు ముఖంపై పిడుగులు కురిపించే అతని బాక్సింగ్ పిడిగుద్దుల లక్ష్యం ఒకేటే. బతకడం..! కేవలం జంతుప్రాయంగా కాకుండా నికార్సయిన మనిషిలా ఆత్మగౌరవంతో బతకడం. అణచివేతను ధిక్కరిస్తూ బతకడం. తనే కాకుండా తన చుట్టూ ఉన్నవాళ్లను కూడా బతికించడం. అందుకోసం చావుకు భయపడకుండా చావడాన్ని కూడా నేర్చుకోవడం, వేసే ప్రతి అడుగును కదం తొక్కించడం. జీనా హైతో మర్ నా సీఖో, కదం కదం పర్ లడ్‌నా సీఖో అని అతడు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందర 50 ఏళ్ల కిందట చేసి సింహగర్జనను జీవన్ రెడ్డి రీసౌండ్‌తో థియేటర్ దద్దరిల్లేలా వినిపిస్తాడు. 

ఇదీ కథ.. 

‘దళం’ చిత్రంతో విభిన్న దర్శకడుని అనిపించుకున్న జీవన్ రెడ్డి.. జార్జిరెడ్డిని కూడా రొటీన్ బయోపిక్‌లా కాకుండా విభిన్నంగా తీర్చిదిద్డాడు. వర్తమానం నుంచి గతంలోకి, గతం నుంచి వర్తమానంలోకి కథను నడిపిస్తాడు. జార్జిరెడ్డి స్నేహితురాలి కూతురిలా మనం కూడా అని ఆనవాళ్లను వెతుక్కుంటూ పోతాం. 50 ఏళ్ల కిందటి ఉస్మానియాను నేటి ఉస్మానియానూ పోల్చుకుంటూ జార్జిరెడ్డి తిరిగిన దారుల్లో సాగిపోతాం. జార్జిరెడ్డి(సందీప్ మాధవ్)ది చిన్నప్పటి నుంచి అన్యాయంపై తిరగబడే స్వభావం. కేరళలో పుట్టి, బెంగళూరు, చెన్నెలలో చదివి హైదరాబాద్ వస్తాడు. ఉస్మానియా వర్సిటీలో చేరతాడు. కులమతాల వారీగా, పార్టీలవారీగా విడిపోయిన రెండు విద్యార్థి సంఘాల స్వార్థం, బడుగు వర్గాల విద్యార్థులపై అణచివేత, వివక్ష, దాడులు అతణ్ని కదిలిస్తాయి. చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాటుదేలిన జార్జిరెడ్డి న్యాయంవైపు నిలబడుతూ, అడ్డొచ్చిన వారిని బాక్సింగ్ పంచ్‌లతో చితగ్గొడతాడు. బ్లేడ్లగుత్తి చుట్టిన కర్చీఫ్‌తో అతడు శత్రువులపై లాఘవంగా దాడి చేస్తుంటే మన ఒళ్లు నిక్కబొడుచుకుంటుంది. అదే సమయంలో చదువులోనూ దూసుకెళ్తాడు. విద్యార్థుల అభిమానం చూరగొంటాడు. ‘మన తల్లిదండ్రులు కడుతున్న పన్నులతో నడుపుతున్న యూనివర్సిటీ ఇది. మన హక్కుల కోసం కొట్లాడాలి’ అని విద్యార్థులను ఏకం చేస్తాడు. పీఎస్ పేరుతో కొత్త విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలుస్తాడు. ఇంత వేడి రాజకీయాలు, గొడవల్లో ఇక ప్రేమకు చోటెక్కడ? 

మాయ(ముష్కాన్) జార్జిరెడ్డి క్లాస్‌మేట్. ఆమెది వన్ సైడ్ ప్రేమ. అతనికి ఆ విషయం తెలియదు. జార్జిరెడ్డి ప్రతిభకు మెచ్చి ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొస్తాయి. కానీ జార్జి ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల కోసం వాటిని తిరస్కరిస్తాడు. రైతుల, కార్మికుల సమస్యలపైనా పోరాడతాడు. గూడు కోల్పోయిన పేదలకు అండగా నిలుస్తాడు. వ్యక్తి నుంచి ఉద్యమ శక్తిగా మారతాడు. దేశంలోని ఇతర వర్సిటీల్లో ఉద్యమాలను రగిలిస్తాడు. అప్పుడప్పుడే మొదలైన నక్సలైట్ ఉద్యమంతో పరిచయం అవుతుంది. ఆయుధం అవసరం మరింతగా తెలుస్తుంది. ఫలితంగా ఓ వైపు శత్రువుల నుంచి, మరోవైపు పోలీసుల దాడులు మొదలవుతాయి. వీటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు? ఒక పక్క ప్రాణాలకు తెగించి పోరాడుతూనే, మరోపక్క విద్యార్థులను ఎలా చైతన్యవంతం చేశాడు? అతణ్ని మట్టుబెట్టడానికి శత్రువులు పన్నిన వ్యూహాలేంటి? చివరకు అతడేమయ్యాడు? అన్నదే కథ!

George reddy biopic.

కథనం.. 

సినిమా ఓ దృశ్యకావ్యంలా మొదలవుతుంది. పచ్చని కేరళ సీమలో చిన్న జార్జి ఆటపాటలు, అల్లరి ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఉస్మానియా వర్సిటీకి వెళ్లే బస్సులో మహిళలను వేధించే ఆకతాయిలపై ముష్టిఘాతాలు కురిపిస్తూ జార్జి పరిచయం అవుతాడు. మొదటి భాగం పాత్రల పరిచయం, రాజకీయాలు, గొడవలతో వేగంగా సాగుతుంది. సంభాషణలు మనం మాట్లాడుకున్నట్లే సహజంగా ఉంటాయి. హాస్యం కథలో భాగంగానే ఉంటుంది తప్పితే ఇరికించినట్లు ఉండదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ శక్తిమంతంగా సాగుతుంది. ద్వితీయార్థంలో జార్జిరెడ్డి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన క్రమం చూస్తాం. కొన్ని సన్నివేశాలను వివరంగా చూపే యత్నంలో సాగదీసినట్లు అనిపిస్తుంది. కథలోని పరిమితి వల్ల.. పాత్రలు, సన్నివేశాలు వర్సిటీని దాటి బయటికి రాకవపోవడం కొంత ఇబ్బందికరమే. అయితే పతాకఘట్టంతో ఆ పరిస్థితి మారుతుంది. జార్జిరెడ్డి ఆఖరిపోరాటం ప్రేక్షకులను కుర్చీలోంచి లేవనివ్వదు. బయోపిక్‌లోని పరిమితులను అధిగమించడానికి కొన్ని కమర్షియల్ అంశాలను జోడించినట్లు కనిపిస్తుంది. సంభాషణలు శక్తిమంతంగా సాగుతాయి. అయితే ఇంగ్లిష్, హిందీ కలగలసిపోవడం, కొన్నిచోట్ల సరిగ్గా అతక్కపోవడం ఇబ్బంది పెడుతుంది. పాత్రల సంఖ్య పెరగడంతో కొన్ని సరిగ్గా ఎలివేట్ కాలేదు. ప్రధాన విలన్ అని ప్రచారమైన సత్యదేవ్ పాత్ర అర్ధాంతరంగా వెళ్లిపోతుంది. చిత్రంలో పార్టీల పేర్లను, విద్యార్థి సంఘాలను పేర్లను నేరుగా ప్రస్తావించకపోవడంలో దీనిపై వివాదం రేగే ప్రసక్తే లేదు. క్యాస్టూమ్స్, ఆర్ట్.. మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. బ్లడ్ ఫైట్, ఫైర్ బాల్ సీన్లను గుర్తుండిపోతాయి. జార్జిరెడ్డి రూపొందించిన పిడికిలి జెండాను కూడా మరచిపోలేం. 

సందీప్ మాధవ్ జార్జిరెడ్డిగా జీవించేశాడు. ‘వంగవీటి’ నుంచి ‘జార్జిరెడ్డి’గా పరిణతి సాధించాడు. స్టయిల్, ఆవేశం, స్నేహంతో ఆకట్టుకుంటాడు. పోరాట సన్నివేశాల్లో చెలరేగిపోతాడు. తల్లిగా మారాఠీ నటి(దేవిక) మెప్పిస్తారు. తక్కువ మాటలతోనే ఎక్కువ భావాన్ని పలికిస్తారు. ముష్కాన్ ఏకపక్ష ప్రేమ కదిలిస్తుంది. అందరూ కొత్తవాళ్లు కావడంతో బ్రాండ్ ప్రభావం కనిపించదు. నిర్మాణ విలువల్లో రాజకీపడకుండా తెరకెక్కించిన జార్జిరెడ్డికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్, ఫొటోగ్రఫీ పాయింట్. సినిమా కోసం జీవన్ రెడ్డి పడిన కష్టం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. వాస్తవాలకు కొన్ని కల్పనలు, కమర్షియల్ ఎలిమెంట్లను జోడిస్తూ సక్సెస్‌ఫుల్ బయోపిక్‌ను అందించాడు. 

ముగింపు..

జార్జిరెడ్డి జనం సినిమా. ముఖ్యంగా విద్యార్థి, యువత సినిమా. వారిలో సహజంగానే ఉండే ఆవేశానికి ఇది అద్దం పడుతుంది. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’, సావిత్రి ‘మహానటి’.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘సైరా నరసింహారెడ్డి’.. మరెన్నో బయోపిక్‌లకు ఇది భిన్నం. ఇది విశ్వజనీన యువకథ. ఇందులో మన్నల్ని మనం గుర్తుపట్టుకోవచ్చు! జార్జిరెడ్డిలా పిడికిలి బిగించొచ్చు!

 

జార్జిరెడ్డి (బయోపిక్)

నటీనటులు: సందీప్‌ మాధవ్‌, ముస్కాన్, సత్య దేవ్, మనోజ్‌ నందన్, అభయ్‌, యాదమరాజు, శత్రు..

దర్శకత్వం:  జీవన్ రెడ్డి

సినిమాటోగ్రఫీ: సుధాకర్ యక్కంటి(మరాఠీ ‘సైరాట్’ ఫేమ్)

సంగీతం: సురేశ్ బొబ్బిలి

నిర్మాత: అన్నపరెడ్డి అప్పిరెడ్డి