రాజాసింగ్‌ హెచ్చరికపై 'జార్జిరెడ్డి' డైరెక్టర్ స్పందన - MicTv.in - Telugu News
mictv telugu

రాజాసింగ్‌ హెచ్చరికపై ‘జార్జిరెడ్డి’ డైరెక్టర్ స్పందన

November 21, 2019

George reddy director responds to mla raja singh comments.

ఉస్మానియా యూనివర్సిటీ చేగువేరాగా పేరొందిన జార్జిరెడ్డి జీవితం ఆధారంగా తీసిన చిత్రంపై గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించిన సంగతి తెల్సిందే. తమకు ఈ సినిమాపై అభ్యంతరం లేదని, అయితే అందులో వాస్తవాలను మాత్రమే చూపించాలని అన్నారు. చిత్రాన్ని అడ్డుకుంటామని ఏబీవీపీ కార్యకర్తలు చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ…‘ప్రచార వీడియోల్లో ఏకపక్షంగా చూపించారు. సినిమా పేరుతో ఏబీవీపీని కించపరిస్తే సహించం, అడ్డుకుంటాం. జార్జిరెడ్డి హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే  ఏబీవీపీ వ్యక్తులు ఆయనను హత్య చేసినట్లు చూపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించాలి. ఏబీవీపీ కార్యకర్తలపై దాడులు చేయించింది జార్జిరెడ్డే. మీరు నిజాలు చూపండి. అబద్ధాలు కనుక చూపిస్తే మా నుంచి హండ్రెడ్ పర్సంట్ రియాక్షన్ ఉంటుంది’ అని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో జార్జిరెడ్డి చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి స్పందించాడు. ఈరోజు నారాయణగూడ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచి చిత్ర బృందం నివాళులర్పించారు. దర్శకుడు జీవన్, హీరో సహా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ…’జార్జిరెడ్డి హీరోనా? విలనా? అనేది రేపు తేలిపోతుంది. కానీ, నాకు మాత్రం జార్జిరెడ్డి హీరోనే. జార్జిరెడ్డి జీవితాన్ని తెరకెక్కించడానికే నేను పుట్టాను. ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడ్డాను. నీతి, నిజాయితీ నిలువెల్లా నింపుకున్న విద్యార్ధి నాయకుడు జార్జిరెడ్డి. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ మెట్లపై పడుకుని జార్జిరెడ్డి గుండె చెప్పుడు నేను విన్నాను. ఈ సినిమాతో జార్జిరెడ్డి మళ్లీ పుడుతాడు. ఈ సినిమా హింసను ప్రేరేపిస్తుందన్న విమర్శలు సరికాదు.’ అని అన్నారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఆయనతో కలిసి సినిమా చూడడానికి సిద్ధమని తెలిపారు. నవంబర్ 22న విడుదల కానున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించగా, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించారు.