కాలం కన్నవీరుడు జార్జిరెడ్డి.. అతనిలో ఎందుకంత కసి?  - MicTv.in - Telugu News
mictv telugu

కాలం కన్నవీరుడు జార్జిరెడ్డి.. అతనిలో ఎందుకంత కసి? 

October 30, 2019

‘ఉస్మానియా చేగువేరా’గా పేరొందిన జార్జిరెడ్డి జీవితం ఆధారంగా అతని పేరుతోనే బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. నేటి తరానికి పెద్దగా తెలియని ఆ విప్లవ విద్యార్థి జీవితాన్ని రాజీపడకుండా తెరకెక్కించారు. చిత్రాన్ని నవంబర్ 22న విడుదల చేయనున్నారు. 

ఇటీవల విడుదలైన ట్రైలర్ జార్జిరెడ్డి గురించి తెలిసినవారికి పాత రోజులను గుర్తు చేస్తోంది. కొత్త తరానికి ఆయనెవరో తెలుసుకోవాలన్న ఆసక్తి రేకెత్తిస్తోంది. 

మన సమాజం వేళ్లతో సహా కుళ్లిపోయిందని, దాన్ని సమూలంగా మార్చాలని జార్జిరెడ్డి గొంతెత్తాడు. 1960 దశకం చివర్లో, 1970 దశకం మొదట్లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన ఎందుకు వ్యవస్థపై తిరగబడ్డాడు? అక్రమాలను, అవినీతి, మతోన్మాదాన్ని ఎందుకంత తీవ్రంగా ఖండించాడు? ఆయన పోరాటం కేవలం ఉడుకు నెత్తురు ఫలితమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలంటే ఆ కాలంలోకి ప్రయాణించాలి. 

అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి 20 ఏళ్లయింది. నెహ్రూ అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు, పంచశీల వంటి ‘సోషలిజం’ విధానాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు. పేదరికం, అవినీతి, నిరుద్యోగం పెరిగిపోయాయి. వీటిని జీర్ణించుకోలేని యువత నిరాశలో కూరుకుపోయింది. మరికొందరు కుళ్లిపోయిన వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏంటని వెతికారు. పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ పోరాటం అప్పటికి ఉధృతంగా సాగుతోంది. శ్రీకాకుళం, కేరళ వంటి ప్రాంతాలకు దావానంలా వ్యాపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఇందిరాగాంధీ అప్రమత్తమైంది. బ్యాంకులను జాతీయం చేసింది. భూపంపిణీ జరగక్కపోతే పీడిత రైతాంగం తిరగబడుతుందని భూసంస్కరణలకు తెరతీసింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు.  దేశం ఎమర్జెన్సీ దిశగా సాగుతోంది. మరోపక్క మతరాజకీయాలు ఊపందుంటున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల మధ్య యువతకు సరైన దిశానిర్దేశం చేసే వారు కరువయ్యాయి. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ ఘర్షణ మొదలైంది. సత్యం ఒకవైపు, అసత్యం మరోవైపు ఎదురుబొదురుగా నిలబడ్డాయి. 

ఈ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చాడు జార్జిరెడ్డి. రష్యా, చైనా విప్లవాలను, మార్క్సిజాన్ని.. మొత్తంగా సమాజ ధోరణిని చిన్నప్పటి నుంచే ఆకళింపు చేసుకున్న ఆయన మార్పు అన్నది యువతలోనే మొదలు కావాలని తేల్చుకున్నాడు. వారిని చైతన్యవంతం చేయడమే తన కర్తవ్యం అనుకున్నాడు. విద్యార్థులకు ప్రగతిశీల రాజకీయాలు బోధించడం ప్రారంభించారు. తన చదువును నిర్లక్ష్యం చేయకుండానే.. సమాజలో మార్పు కోసం ధైర్యంగా ముందుకు సాగాడు. ఉస్మానియా వర్సిటీలో పేద, నిమ్నకులాల విద్యార్థులపై సాగుతున్న వివక్షను ప్రశ్నించాడు. ‘జీనా హైతో మర్‌నా సీఖో.. కదం కదం పర్ లడ్‌నా సీఖో’ అంటూ విద్యార్థిలోకాన్ని కదిలించాడు. జార్జిరెడ్డి పోరాటాన్ని జీర్ణించుకోలేని శక్తులు అతని చుట్టుముట్టి బలితీసుకున్నాయి. అయినా అతడు ఆనాడు రగిలించిన నిప్పురవ్వు ఇంకా రగులుతూనే ఉంది! 

ిి