‘ఎవ్వరి మాటా వినొద్దు.. జార్జి రెడ్డి చూడండి’...రివ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఎవ్వరి మాటా వినొద్దు.. జార్జి రెడ్డి చూడండి’…రివ్యూ

November 28, 2019

జార్జిరెడ్డి జీవితం ఓ విజయ గాథనా? ఓ విఫల చరిత్రా? అనే ప్రశ్నకు ఏం సమాధానం చెబుతామో, జార్జిరెడ్డి సినిమా ఎలా ఉంది అనే ప్రశ్నకూ అదే సమాధానం వర్తిస్తుంది. చెగువేరా, భగత్ సింగ్ లాగానే విద్యార్థులు జార్జిరెడ్డి ఫోటోలు కూడా నోటు పుస్తకాల్లో పెట్టుకుని తిరిగే రోజు ఒకటుండేదని గుర్తు చేశారు. ఎవ్వని మాటా వినొద్దు. జార్జిరెడ్డిని చూడండి. జార్జిరెడ్డి లాంటిదే జార్జిరెడ్డి సినిమా. 47 ఏళ్ల క్రితం హత్యకు గురైన 25 ఏళ్ల యువకుడి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే, ఆ మనిషి కాలగర్భంగలో కలిసినట్టా? కాలాలకు అతీతంగా మనలో ప్రవహిస్తున్నట్టా? చరిత్ర పాఠాల్లో ఎక్కడా ప్రస్తావించని ఒక పోరాట యోధుడి గురించి నేటి తరం మాట్లాడుకునే పరిస్థితి కల్పించిన జార్జిరెడ్డి సినిమా సూపర్ హిట్టా? ఫట్టా?

George reddy

జార్జిరెడ్డి జీవితం ఓ విజయ గాథనా? ఓ విఫల చరిత్రా? అనే ప్రశ్నకు వచ్చే సమాధానమే చెబుతామో, జార్జిరెడ్డి సినిమా ఎలా ఉంది అనే ప్రశ్నకూ వర్తిస్తుంది. కొన్ని జీవితాలు, కొన్ని ప్రయత్నాలను సంప్రదాయ గంతలు కట్టుకుని చూస్తే దృశ్యం మసకగానే కనిపిస్తుంది. జార్జిరెడ్డి సినిమాను ప్రస్తుతమున్న పరిమితులకు లోబడే తీశారు. అది రాజీపడడం కాదు. అలా తీయకుంటే కనీసం విడుదలకు కూడా నోచుకోకపోవునేమో. చెప్పాల్సింది చెప్పారు. అర్థం కావాల్సిన వారికి అర్థం అయింది. జార్జిరెడ్డి అనే ఓ కేరక్టర్‌ను మరో తరానికి వారసత్వంగా అందించారు. చెగువేరా, భగత్ సింగ్ లాగానే విద్యార్థులు జార్జిరెడ్డి ఫోటోలు కూడా నోటు పుస్తకాల్లో పెట్టుకుని తిరిగే రోజు ఒకటుండేదని గుర్తు చేశారు. సినిమా తీసిన వాళ్ళు కూడా ఆశించింది అదే కావచ్చు.

 సమాజం గురించి కాకుండా కెరీర్ గురించి ఆలోచిస్తే, ఫిజిక్స్‌లో గోల్డ్ మెడలిస్టు అయిన జార్జిరెడ్డి ఓ గొప్ప సైంటిస్ట్ అయ్యేవాడేమో. నేటికీ సుఖంగా, ప్రముఖంగా జీవించి ఉండేవాడేమో. జార్జిరెడ్డి సినిమా తీసిన వాళ్లు కూడా గొప్ప కమర్షియల్ సినిమా తీయగలిగే వాళ్లేనమో. డబ్బులు కూడా బాగానే సంపాదించి ఉండే వారేమో. కానీ వాళ్ల ఆలోచన అంత కురచగా లేదు. బతకనేర్చినతనపు లక్షణం కాదది, బతుకు చూపించే వాళ్ల కర్తవ్యం. తెలంగాణ ప్రజలు ఆర్థికంగా బలవంతులు కాకపోవచ్చు. కానీ, రాజకీయంగా చైతన్య వంతులు, మానసికంగా బలవంతులు, సాంస్కృతిక సంపన్నులు. ఈ గుణాలే తెలంగాణ వారసత్వ సంపద. ఆధిపత్యంపై ధిక్కారమే ఈ నేల డిఎన్ఏ. ప్రజల కోసం బతికిన, సిద్దాంత నిబద్ధతతో మరణించిన ఎందరినో కన్నది తెలంగాణ నేల. సమైక్య పాలనలో వారి గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ భూమి పుత్రుల చరిత్రలు బయటకు వస్తున్నాయి. దీనికి సినిమా కూడా ఓ సాధనం కావడం శుభ పరిణామం. మన భాషను, యాసను వెక్కిరించిన వెండితెరమీదే మన స్పూర్తి ప్రధాతల ఘనతను చూసుకోవడం గొప్ప అనుభూతి. ఈ ప్రయత్నాలు కొనసాగాలి. జార్జిరెడ్డి లాగానే జార్జిరెడ్డి సినిమా కూడా ఓ స్పూర్తి.

-గటిక విజయ్‌కుమార్, సీనియర్ జర్నలిస్ట్