జార్జిరెడ్డిపై ఆంగ్ల మీడియా ప్రశంసలు.. 3.5 రేటింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డిపై ఆంగ్ల మీడియా ప్రశంసలు.. 3.5 రేటింగ్

November 22, 2019

ఉస్మానియా యూనివర్సిటీ విప్లవ కెరటం జార్జిరెడ్డిపై రూపొందిన జీవితకథాచిత్రం ఊహించినట్లుగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఐదు దశాబ్దాల కిందటి ఆయన పోరాటాన్ని దర్శకుడు జీవన్ రెడ్డి కళ్లకు కట్టారని ప్రశంసలు వస్తున్నాయి. తెలుగు మీడియాతోపాటు ఆంగ్ల పత్రికలు కూడా ఈ చిత్రంపై సమీక్షలు ప్రచురిస్తున్నారు. ప్రముఖ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా తన వెబ్ సైట్‌లో ఈ చిత్రాని 3.5 రేటింగ్ ఇచ్చింది. 

జార్జిరెడ్డి జీవితాన్ని వాస్తవికంగా తెరకెక్కించారని కొనియాడింది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ శక్తిమంతంగా ఉందని, సుధాకర్ యక్కండి కెమెరా పనితనం కూడా అగ్రస్థాయిలో ఉందని ప్రశంసించింది. అయితే కొన్ని సీన్లమధ్య సంబంధం కొంత తెగిందని పేర్కొంది. ఏదేమైనా ఈ చిత్రం తెలుగు తెరపై కొత్త ప్రయోగమని, ప్రేక్షకుల్లో ఉత్కంఠ, ఉద్వేగం కలిగిస్తుందని కితాబిచ్చింది. మరో ప్రముఖ వెబ్‌సైట్ సిఫీ ఈ చిత్రానికి 2.75 రేటింగ్ ఇచ్చింది. ఇక సాక్షి, తెలుగు సమయం తదితర వెబ్ సైట్లు కూడా చిత్రాన్ని ప్రశంసించాయి. చాలా మీడియా సంస్థలు ఈ చిత్రం సరికొత్త ప్రయోగమని,

George reddy movie review.

మారుతున్న తెలుగు సినిమాకు అద్దం పడుతోందని, దర్శకుడి నీతి నిజాయితీలకు నిదర్శనమని పేర్కొన్నాయి. ఇక విద్యార్థులు, యువత.. తాము జార్జి జీవితం గురించి తెలుసుకున్నామని, ‘ఆరోజు జార్జి గన్ వాడి ఉంటే ఈ చరిత్ర మరోలా ఉండేది’ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. చిత్రంపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. జార్జిలో హీరోయిజం ఎక్కువగా కనిపించిందని, ఆయన సైద్ధాంతిక భావజాలాన్ని చూపడంలో తడబాట్లు పడ్డారని పేర్కొంటున్నాయి. మొత్తానికి ఈ చిత్రం ఈ తరానికి అంతగా తెలియని ఒక విప్లవ విద్యార్థి జీవితాన్ని అతని స్థలకాలాలతో మనమందు నిలబెట్టిందని అన్ని సమీక్షల్లో పేర్కొంటున్నారు. చిన్నచిన్న లోపాలు ఉన్నా సినీ అభిమానులందరూ చూడాల్సిన సినిమా అని అంటున్నారు.  పాతతరం వాళ్లు తమ ఉద్యమాలను గుర్తుకు చేసుకోడానికి కొత్తతరం ఆ నాటి ఉద్యమ నాయకులు ఎలా ఉండేవారో తెలుసుకోడానికి ఈ చిత్రం పనికొస్తుందని సూచిస్తున్నారు. హీరో సందీప్ మాధవ్ జార్జి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని, అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజపడకుండా చిత్రాన్ని తీసుకొచ్చారని కొనియాడుతున్నారు.