జార్జిరెడ్డి బతికొచ్చాడు.. ఆర్జీవీ ప్రశంస - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డి బతికొచ్చాడు.. ఆర్జీవీ ప్రశంస

November 18, 2019

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తనకు ఏది నచ్చినా నచ్చకపోయినా కుండ బద్దలు కొట్టినట్టే చెప్పేస్తాడు. అది సినిమా అయినా, రాజకీయం అయినా విడిచిపెట్టడు. అలాంటి దర్శకుడికి ఓ సినిమా నచ్చాలంటే అందులో ఎంతో విషయం ఉండాలి. ఈ నెల 22న విడుదలకు సిద్ధం అవుతున్న ‘జార్జిరెడ్డి’ సినిమా వర్మకు తెగ నచ్చేసింది. జార్ట్‌రెడ్డిని చూసి థ్రిల్‌కు గురయ్యానని ట్వీట్ చేశాడు. సందీప్‌ మాధవ్‌ నటనతో జార్జ్‌రెడ్డి తిరిగి వచ్చినట్టు ఉందని ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

వర్మ మాత్రమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ఈ సినిమాపై  స్పందిస్తున్నారు. సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తొలుత నుంచి ఈ సినిమాకు సపోర్టుగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అవతరించిన జార్జిరెడ్డి కథే ఈ సినిమా. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. యూనివర్సిటీకి కత్తులు, నకల్స్ పరిచయం చేసిన వ్యక్తిని హీరోలా చూపిస్తున్నారంటూ, విడుదలను అడ్డుకోవాలని ఓ వర్గం ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరో వర్గం మాత్రం జార్జ్‌రెడ్డి చరిత్ర మర్చిపోయిన స్టూడెంట్‌ లీడర్‌ అంటూ  ఆకాశానికి ఎత్తుతోంది. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా జరగాల్సిన సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. సిల్లీమోంక్స్‌, త్రీలైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు.