German Shepherd detained under Excise law in Bihar's Buxar
mictv telugu

కుక్క అరెస్ట్, 11 రోజులుగా పోలీస్ రిమాండులో..

July 18, 2022

మద్యం అక్రమ రవాణా కేసులో జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 11 రోజులగా ఆ శునకం పోలీసు రిమాండ్ లోనే ఉంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఘటన వివరాల్లోకి వెళితే….జూలై 6న బీహర్ లోని బక్సర్‌ జిల్లా వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో యూపీలోని ఘాజీపూర్ నుంచి వస్తున్న ఓ ఎస్‌యూవీ వెహికల్‌ను ఆపి తనిఖీలు చేశారు.

వాహనం నుంచి విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నందుకు గాను వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అరెస్ట్ చేసే సమయంలో నిందితులతో పాటు కారులో ఉన్న శునకాన్ని కూడా పోలీసులు రిమాండ్ లోకి తీసుకున్నారు. పోలీసులు అలా ఎందుకు చేశారో తెలియదు కానీ దీంతో ఇప్పుడు పోలీసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అలాంటి ఖరీదైన శునకాలను మెయింటేన్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని పోలీసులు చెబుతున్నారు. స్టేషన్ సిబ్బంది తలా కొంత చందాలు వేసుకొని కుక్కకు ఆహారం పెడుతున్నారు. ఈ మర్యాదలు ఏ మాత్రం తగినా సదరు కుక్కగారు గట్టిగా మొరుగుతూ అందరినీ ఇబ్బంది పెడుతుంది. దీంతో ఆ కుక్కను తీసుకు వెళ్లాలని యజమానిని పోలీసులు వేడుకుంటున్నారు.