దేశంలో కరోనా క్రియాశీలక కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానాలు, విమానాశ్రయాలలో మాస్కు ధరించడాన్ని నిర్బంధంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. నిబంధనలను పాటించని వారిని నిర్దాక్షిణ్యంగా విమానం, విమానాశ్రయం నుంచి బలవంతంగా గెంటేయాలని స్పష్టం చేసింది. అంతేకాక, అలాంటి వారికి భారీ జరిమానాలు వేయాలని సూచించింది.
ఎయిర్ పోర్టుల్లో కరోనా నిబంధనలను పాటించకపోవడంపై దాఖలైన పిటిషన్ను చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ శుక్రవారం విచారించారు. ఈ సందర్భంగా పై సూచనలు చేసింది. అంతేకాక, తినేటప్పుడు, తాగేటప్పుడు మాస్కు గురించి ఎవరూ అడగరని, మిగతా సమయాల్లో మాత్రం మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. తమ ఆదేశాలకనుగుణంగా డీజీసీఏ కఠిన నిబంధనలను రూపొందించాలని ఆదేశించింది. కాగా, కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. అవసరమైన చోట తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.