తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య గొడవ ముదురుతోంది. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ తీరుపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. రాష్టవ్యాప్తంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు అతికించారు. ‘గెటవుట్ రవి’అంటూ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. ఇదే స్లోగన్‌తో సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది.
అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రసంగాన్ని డీఎంకే పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రసంగ సమయంలో తమిళనాడు ప్రభుత్వం, పెరియార్, కామ రసకర్పూరం, ద్రావిడాది మోడల్, అంబేద్కర్, కె.కామరాజ్, అన్నాదురై, కరుణానిధి పదాలను విడిచిపెట్టి గవర్నర్ ప్రసంగించడంపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలో కొన్నింటిని వదిలేసి గవర్నర్ చదవడం సభ నిబంధనలకు విరుద్ధమని స్టాలిన్ మండిపడ్డారు. సభలో గవర్నర్ ప్రసంగిస్తున్నంతసేపు డీఎంకే నేతలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఇక్కడ రుద్దొద్దు, దయచేసి తమిళనాడు వదిలి వెళ్లిపోండి అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ సొంత ప్రసంగాన్ని రికార్డుల్లోకి ఎక్కించవద్దని స్టాలిన్ ప్రభుత్వం తీర్మానం చేసింది.
సీఎం స్టాలిన్ ఈ తీర్మానం చదువుతుండగానే గవర్నర్ ఆర్ఎన్ రవి కోపంతో వాకౌట్ చేశారు. సభలో నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ వ్యవహారం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తొన్న డీఎంకే నేతలు ‘గెట్ అవుట్ రవి’ అంటూ ప్రచారం షురూ చేశారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.