తొలి జీతం తీసుకుని.. గోదావరిలో కనుమరుగై.. - MicTv.in - Telugu News
mictv telugu

తొలి జీతం తీసుకుని.. గోదావరిలో కనుమరుగై..

September 16, 2019

Godavari .....

గోదావరిలో లాంచీ మునిగి చనిపోయినవారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. వాళ్లలా చెబుతుంటే వింటున్నవాళ్లు కన్నీళ్లు కార్చకుండా వుండలేరు. సరదాగా విహారయాత్రకు వెళ్ళిన వారిని మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వరంగల్, హైదరాబాద్‌లకు చెందినవారు చనిపోయారు. 

అదే వారి చివరి ఆనందం అయింది.. 

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లక్షణ్, రమ్య ఏఈలుగా ఇటీవలే ఉద్యోగాలు పొందారు. మొదటి నెల జీతం అందుకున్నారు. తొలి జీతంతో సరదాగా పాపికొండలు సందర్శించి వద్దామని భావించారు. మిత్రులతో కలిసి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. కానీ, అదే వారి చివరి ఆనందం అయిపోయింది? వారి ఆనందాన్ని గోదావరి చదిమేసింది. అనుకోకుండా జరిగిన పడవ ప్రమాదంలో వారిద్దరూ గల్లంతయ్యారు. లక్ష్మణ్‌ది కర్ణమామిడి గ్రామం.లక్ష్మణ్‌ తండ్రి రామయ్య సింగరేణి ఉద్యోగం చేస్తూ పదేళ్ల కిందట మరణించారు. తండ్రి చనిపోయాడని లక్షణ్ కృంగిపోలేదు. చదువే తన భవిష్యత్తు అనుకున్నాడు. బాగా కష్టపడి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. 

అతని కష్టానికి ప్రతిఫలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అతడికి తల్లి శాంతమ్మ, అన్నయ్యలు తిరుపతి, రాము అండగా నిలిచారు. సోదరులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే కావడం మరో విశేషం. రాము – లక్ష్మణ్‌ కవల పిల్లలు. నిర్మల్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లి పడవ ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఏదైనా మాయ జరిగి లక్ష్మణ్ తిరిగి క్షేమంగా రావాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

ఇక రమ్యది మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నంనూరు గ్రామం. విద్యుత్తు శాఖ ఉద్యోగి కారుకూరి సుదర్శన్‌- భూమక్క దంపతుల కుమార్తె రమ్య. చిన్ననాటి నుంచే చదువులో చలాకీగా ఉండే రమ్య.. ఉన్నత ఉద్యోగం సాధించాలని మరింత కష్టపడి చదువుకుంది. ఇటీవల ఏఈగా ఉద్యోగం సాధించింది. ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ సబ్‌ డివిజన్‌లో సబ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తోంది. మొదటి జీతం అందుకున్న రమ్య స్వగ్రామం నంనూరులో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసింది. నిమజ్జనం రోజున బంధువులు, మిత్రులతో కలిసి ఆనందంగా గడిపింది. ఆ తర్వాత వీకెండ్ కావడంతో శనివారం మిత్రులతో కలిసి పాపికొండల యాత్రకు బయలుదేరింది. అదే వారి చివరి ఆనందం అయింది. 24 గంటలు గడిచినా వారి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.