లంగర్ హౌజ్‌లో విషాదం.. గీజర్ పేలి నవ దంపతులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

లంగర్ హౌజ్‌లో విషాదం.. గీజర్ పేలి నవ దంపతులు మృతి

October 21, 2022

Geyser Explosion: couple Died With Short Circuit In Hyderabad Langar House

హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో విషాదకరమైన సంఘటన జరిగింది. బాత్రూంలో గీజర్ పేలి నవ దంపతులు మరణించారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వైద్యులే. షార్ట్ సర్క్యూట్ వల్ల గీజర్ పేలినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. వివరాలు.. లంగర్‌హౌస్‌లోని ఖాదర్‌భాగ్‌కు చెందిన డాక్టర్‌ ఉమ్మాయ్‌ మెహిమాన్‌ సాహిమ, డాక్టర్‌ నిసారుద్దీన్‌ భార్యాభర్తలు. వీరికి రెండు నెలల క్రితమే వివాహమయింది. నిసారుద్దీన్‌ సూర్యాపేటలోని ప్రభుత్వాసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. వీరు ఖాదర్‌బాగ్‌లోను, సాహిమ తల్లిదండ్రులు టోలిచౌకిలోని మెరాజ్‌ కాలనీలో నివాసముంటున్నారు.

ఉదయం నుంచి సాహిమ నుంచి ఫోన్‌ రాకపోవడం, కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఖాదర్‌బాగ్‌లో కూతురు, అల్లుడు ఉంటున్న ఫ్లాట్‌ వద్దకు వెళ్లారు. కాలింగ్‌ బెల్‌ కొట్టినా ఎంతకూ తలుపులు తెరవలేదు. దాంతో డోర్లు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. నిసారుద్దీన్‌, సాహిమా బాత్రూంలో పడి ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. పోలీసులకు సమాచారమివ్వగా ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టంకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా గీజర్‌ పేలి ఉంటుందని భావిస్తున్నారు.