గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించగా.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను గత రాత్రి విడుదల చేసింది.
ఈ పురస్కారాల్లో తెలంగాణకు ఐదు అవార్డులు లభించాయి. ఇద్దరికి పద్మభూషణ్ రాగా, ముగ్గురికి పద్మశ్రీ వరించింది. ఆధ్మాత్మికం విభాగంలో శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కమలేష్ డి పటేల్ లు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో మోదడుగు విజయ్ గుప్తకు, మెడిసిన్ విభాగంలో హనుమంతరావు పసుపులేటికి, లిటరేచర్, ఎడ్యుకేషన్ విభాగంలో బి రామక్రిష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. అయితే ఈ ఐదుగురు కూడా తెలంగాణకు చెందిన వ్యక్తులు కారని సోషల్ మీడియా జరుగుతున్న రచ్చ.. తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ విషయంపై టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి ఫేస్ బుక్ వేదికగా.. తెలంగాణ కోటాలో పద్మ అవార్డులకు ఎంపికైన ఐదుగురిలో ఒక్కరు కూడా తెలంగాణ వాళ్లు కాదని పోస్ట్ చేశారు. పద్మభూషణ్ పురస్కారాలకి ఎంపికైన చినజీయర్ స్వామిది ఆంధ్ర కాగా.. కమలేష్ డి పటేల్ ది ఉత్తర భారతదేశమని చెప్పారు. అదే విధంగా పద్మశ్రీ వరించిన మోదడుగు విజయ్ గుప్త, పసుపులేటి హనుమంతరావులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారని, బి రామక్రిష్ణారెడ్డిది కూడా తెలంగాణ కాదని, రాయలసీమ వాసి అని చెప్పారు. తెలంగాణలో ‘పద్మ’ పురస్కారాలకి అర్హులే లేరా? అంటూ ఘంటా ప్రశ్నించారు.
మరోవైపు పలు రంగాల్లో తమ జీవిత కాలంలో చేసిన విశిష్ఠ సేవల ద్వారా భారత ప్రభుత్వ పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపేరునా అభినందనలు తెలిపారు. వారిలో ఈ ఐదుగురు కూడా ఉన్నారు.