Ghaziabad gang-rape claim 'fabricated', conspiracy for property: Police
mictv telugu

ఢిల్లీ రేప్ కేసులో భారీ ట్విస్ట్.. వారిని ఇరికించడానికే మహిళ డ్రామా

October 21, 2022

దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని వార్తలు వస్తున్న క్రమంలో.. 40 ఏండ్ల ఓ మహిళ చేసిన పని అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఆస్తి వివాదంలో నిందితులను ఇరికించేందకు తనపై తానే పెద్ద అపనింద వేసుకుంది. తనను ఐదుగురు వ్యక్తులు కలసి రేప్ చేశారని, ప్రైవేట్ పార్ట్స్‌లో ఇనుపరాడ్డు చొప్పించారని ఓ కట్టుకథ అల్లింది. అయితే సదరు మహిళ ఆజాద్ అనే మరో వ్యక్తితో కలసి గ్యాంగ్ రేప్ డ్రామా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మహిళ రెండు రోజుల క్రితం ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. ఆమె చెప్పినదాని ప్రకారం ముందుగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

అక్టోబర్ 18 ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ ఘజియాబాద్ లో జరిగిన ఓ బర్త్ డే పార్టీకి వెళ్లివచ్చే సమయంలో బస్టాండ్ లో ఉన్న ఆమెను కారులో అపహరించి రెండు రోజుల పాటు నిర్భందించి ఐదుగురు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్ చొప్పించారని.. బాధిత మహిళ తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో మహిళ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించింది. మొదటగా ఘజియాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు తీసుకెళ్తే, అందుకు ఆమె తిరస్కరించింది. మీరట్ ఆస్పత్రిలో కూడా ఇదే విధంగా చేసింది. చివరకు ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. ఆస్తి వివాదంలో నిందితులను ఇరికించేందుకు అత్యాచారం కుట్రకు పాల్పడినట్లు వెల్లడిచింది. విచారణ సమయంలో ఆజాద్ మొబైల్ స్విచ్ఛాప్ ఉండటం కూడా పోలీసుల అనుమానాలను బలపడేలా చేశాయి. దీంతో అత్యాచారం కుట్ర వీడింది. ఈ డ్రామాకు సహకరించిన ఆజాద్, గౌరవ్, అఫ్జల్ మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.