నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కాకుండా.. దానిని అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి.. రెండు కి.మీ. వరకూ ఈడ్చుకెళ్లిన యువకుడిని ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘజియాబాద్‌లోని సిహాని గేట్ ప్రాంతంలో 17 ఏళ్ల యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారు నడుపుతూ.. మొదట ఓ సైక్లిస్ట్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనతో అక్కడే ఉన్న కానిస్టేబుల్.. ఆ కారును ఆపేందుకు ప్రయత్నించగా.. అతన్ని కూడా ఢీకొని… కారు బానెట్‌పై రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది.
అయితే ఆ తర్వాత కొందరు వ్యక్తులు కారును ఆపి కారు డ్రైవర్‌ను పట్టుకున్నారని ఘజియాబాద్ సర్కిల్ ఆఫీసర్ అలోక్ దూబే తెలిపారు. బానెట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను గుర్తించిన స్థానికులు కారును వెంబడించి, యశోద ఆసుపత్రి సమీపంలో పట్టుకోగలిగారన్నారు. కారును ఆపాలని దాని చుట్టుముట్టారు. కారులో ఉన్న యువకుడి ఇద్దరు స్నేహితులు కారుతో సహా అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు సహకారంతో పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు, యువకుడిని అరెస్ట్ చేశారు. యువకుడు ఓ ప్రైవేట్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నట్లుగా తెలిసింది.